మీడియా ఒక వైపే ఉంటే దాన్నేమంటారు. దీనికి 'సాక్షి మీడియా' సమాధానం చెప్పాలి. తెదేపాకు ఈనాడు, ఆంధ్రజ్యోతి అనుకూలంగా రాస్తే పచ్చమీడియా అని వ్యంగ్యరాతలు రాస్తుంది. అదే పని తనుచేస్తే మాత్రం విలువలు అంటుంది. మీడియా ముసుగులో వైకాపాకు భజన చేసే సాక్షి పత్రిక మంగళవారం పార్టీ ఫిరాయింపుదార్లపై ఒక కథనం రాసింది.
ఎమ్మెల్యేలు అనే గౌరవం లేకుండా 'కుడితిలో పడ్డ ఎలుకలు' అని హెడ్డింగ్ పెట్టింది. వైకాపానుండి తెదేపాలోకి జంప్ అయిన 17 మంది ఎమ్మెల్యేలు ఇబ్బంది పడతున్నారని, జంప్ సందర్భంగా తీసుకున్న డబ్బులో కింది స్థాయి నేతలు వాటాలు అడుగుతున్నారని ఎకసెక్కంగా కథనం రాసింది. పదే పదే ఎమ్మెల్యేలు అమ్ముడు బోయారని వారిని కించపరుస్తోంది. వాళ్ళు డబ్బులు తీసుకున్నపుడు కిటికిలోంచి చూసినట్టుగా సాక్షి కథనాలు ఉంటున్నాయి.
మునుముందు వైకాపా నుండి మరికొందరు జంప్ కాకుండా కట్టడి చేయడం కోసమే ఇలాంటి కథనాలు తరచుగా ప్రచురిస్తోందని తలకాయున్న ఎవరైన గ్రహిస్తారు. ఇది చవకబారు ఎత్తుగడ.
ఇక 'సాక్షి'కి కేవలం తెదేపాలో చేరిన ఎమ్మెల్యేలే గుర్తున్నారు. అదే పార్టీ నుండి తెలంగాణలో తెరాసలో చేరిన ఎమ్మెల్యేలు గుర్తుకురావడం లేదు. మీడియా అంటే అన్ని ప్రాంతాల వార్తలు చెప్పే ప్రయత్నం చేయాలి. తెలంగాణలో తెరాసలో చేరిన ఎమ్మెల్యేలు హ్యాపీగా ఉన్నారా లేక వాళ్ళు కూడా కుడితిలో పడ్డ ఎలుకల్లాగ గింజుకుంటున్నారా ఈ విషయం సాక్షి స్పష్టం చేయలేదు. తమ పత్రిక జగన్ అనుకూలం కాబట్టి ఆయనకు పనికివచ్చే వార్తలే రాస్తామని చెప్పకనే చెప్పింది. ఇదే విషయాన్ని తన లోగో కింద ఇది జగన్ అనుకూల పత్రిక అని పెద్ద అక్షరాలతో ప్రచురిస్తే ఏ గొడవా ఉండదు. ఆంధ్రలో ఒకలాగా, తెలంగాణలో మరొకలాగా వార్తలు ప్రచురిస్తే ఇది మీడియా విలువల కిందకి వస్తుందా...!