ఏపీ రాజకీయాలు త్వరలో మలుపు తిరుగనున్నాయి. గత ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలలో టిడిపి మిత్రపక్షమైన బిజెపి త్వరలో చంద్రబాబుతో కటీఫ్ చెప్పి, తెలంగాణలో టిఆర్‌ఎస్‌ను, ఏపీలో జగన్‌ను ఎన్డీఏలోకి చేర్చుకోవడం ఇక లాంఛనమే అని తెలుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే ఆయా రాష్ట్రాల బిజెపి ముఖ్యనాయకులకు అమిత్‌షా నుండి సమాచారం కూడా అందిందని చెబుతున్నారు. కేంద్ర స్దాయిలో బిజెపి, టిడిపిల మధ్య పోరు లేకపోయినా రాష్ట్రంలో మాత్రం ఇరుపార్టీలు కత్తులు దూసుకుంటున్నాయి. రాష్ట్ర బిజెపినేతలు ఒకవైపు, టిడిపి నాయకులు మరోవైపు ఉప్పులో నిప్పులా ఉన్నారు. అయితే ముందుగా ఈ బంధాన్ని తామే తెంపుకోవడం బిజెపికి ఇష్టం లేదు. పొమ్మనకుండా పొగబెట్టే వ్యూహాన్ని ఇక్కడ బిజెపి అధిష్టానం అనుసరిస్తోంది. రాబోయే రోజుల్లో మరీ ముఖ్యంగా 2019లో ఏపీలో వైయస్సార్‌సీపీ , తెలంగాణలో టిఆర్‌ఎస్ బలంగా ఉంటాయని, వాటికే గెలుపు శాతం ఎక్కువని, ఆంద్రలో ఇప్పటికే చంద్రబాబు పాలన పట్ల తీవ్ర వ్యతిరేకత మొదలైందని ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన పక్కా సమాచారంతోనే బిజెపి అధిష్టానం ఈ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది.