స్టార్ హీరోలు ప్రయోగాలు చేయాలన్నా లేదా కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వాలన్నా చాలా ఆలోచించాల్సి వస్తుంది. అనవసరంగా రిస్క్ తీసుకుంటున్నామా? అనే విషయంలో వారు ఎన్నో సార్లు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'జనతాగ్యారేజ్' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ ఎన్టీఆర్ బర్త్‌డే కానుకగా విడుదలై అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం తర్వాత తాను చేయబోయే మరో చిత్రానికి సంబంధించి కూడా ఎన్టీఆర్ నిర్ణయం తీసేసుకున్నాడు. 'జనతాగ్యారేజ్' తర్వాత పూరీతో చేస్తాడా? లేక రైటర్ వక్కంతం వంశీకి చాన్స్ ఇస్తాడా? అని ఎదురుచూస్తున్న అభిమానులకు తన తదుపరి చిత్రంపై ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చేశాడు. ఎప్పటినుండో రచయిత వక్కంతం వంశీకి దర్శకునిగా చాన్స్ ఇస్తానని ఎన్టీఆర్ చెబుతూ వస్తున్నాడు. కానీ ఈ ప్రాజెక్ట్ ఏదో ఒక కారణం వల్ల ఆలస్యమవుతూ వస్తోంది. ఎన్టీఆర్ బర్త్‌డే సందర్బంగా ఎన్టీఆర్ అన్నయ్య కళ్యాణ్‌రామ్ ఈ చిత్రంపై క్లారిటీ ఇచ్చేశాడు. తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్‌లో ఎన్టీఆర్ నటించే 27వ చిత్రం ఫస్ట్‌లుక్‌ను పోస్ట్ చేశాడు. ఈ పోస్టర్‌లో దర్శకునిగా వక్కంతం వంశీ పేరును కూడా వేశారు. సో.. ఎన్టీఆర్ 'జనతాగ్యారేజ్' తర్వాత చేయబోయే చిత్రం వక్కంతం వంశీదేనని క్లారిటీ ఇచ్చేశాడు ఎన్టీఆర్.