తమిళనాడుతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా రాజకీయాలకు, సినిమాలకు మంచి అనుబంధం ఉంది. పార్టీలకతీతంగా సినిమా వాళ్ల గ్లామర్ తమ పార్టీలకు ఉండాలని రాజకీయ నాయకులు భావిస్తుంటారు. వారి వల్ల పెద్దగా ఒనగూడే ప్రయోజనం లేకపోయినా సినిమా తారలు తమ పార్టీలో ఉంటే అధిక మైలేజ్ వస్తుందని ఇక్కడి నాయకలు భావిస్తుంటారు. రాజకీయాల్లో ఒక్కోసారి ఒక్క ఓటుకు కూడా ఎంతో విలువ ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రయోజనం అందించే సినీ గ్లామర్‌ను తమకు అనుకూలంగా ఉండాలని వారు కోరుకుంటారు. గత ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్ వల్ల అధిక ప్రయోజనం పొందిన చంద్రబాబుకు ఈ విషయం చాలా బాగా తెలుసు. కాగా ఇప్పుడు జగన్ కూడా అదే వ్యూహంతో ముందుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. పార్టీలో నందమూరి కుటుంబానికి మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలకు ఆప్తుడైన కొడాలి నానికి రాష్ట్ర కార్యదర్శి పదవి ఇవ్వడం ద్వారా కృష్ణా జిల్లాలోనే కాదు.. బయటి జిల్లాలో కూడా ఎన్టీఆర్ అభిమానులను, ఎన్టీఆర్‌ను ఆకట్టుకోవాలనే ఆలోచనలో జగన్ ఉన్నాడు. మరి ఈ విషయంలో జగన్ ఆశలు ఏమేరకు ఫలిస్తాయో వేచిచూడాలి...! వచ్చే 2019కైనా జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ఆయన అభిమానులు తనకు జై కొడతారనే ఆశ జగన్‌లో కనిపిస్తోంది.