చంద్రబాబును విమర్శించడమే ఏకైక ఎజెండా ఉన్న వైకాపా నేత జగన్ కు మరికొద్ది గంటల్లో కొత్త అస్త్రం దొరకనుంది. అదే రోను తుపాను.
ఆంధ్రప్రదేశ్ పై ఊహించని విధంగా విరుచుపడిన తుపాన్ చేసే అపారనష్టం గురించి ఇప్పటి వరకు ఎలాంటి అంచనాలు లేవు. హుద్ హుద్ కంటే ఎక్కువ నష్టం తెస్తుందని ప్రజలు భయపడుతున్నారు. అప్పుడు కేవలం గాలి మాత్రమే ఉండగా ఇప్పుడు వర్షం తోడైంది.
జగన్ విషయానికి వస్తే ఇటీవలే చేసి జలదీక్షకు అనుకున్న మైలేజ్ రాలేదు. ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడితే వర్కవుట్ అవుతుందని భావించినప్పటికీ ప్రజల నుండి ఆశించిన స్పందన రాలేదని పార్టీ వర్గాలే పెదవి విరుస్తున్నాయి. జగన్ కు దీక్ష చేయడం పరిపాటి అయింది కానీ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. అయితే జగన్ దీక్ష ఒక విధంగా రెండు రాష్ట్రాల్లో వేడి మాత్రం పుట్టించిందని చెప్పవచ్చు.
తెలంగాణ ప్రభుత్వ అక్రమంగా ప్రాజెక్టులు కడుతుందని జగన్ ప్రజలకు చేరవేశాడని పార్టీ వర్గాలు ఒకింత సంతృప్తి పడుతున్నాయి. సరిగ్గా దీక్ష ముగిసిన మరునాడే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రావడం వల్ల ప్రజల, నేతల దృష్టి మొత్తం అటువైపు మళ్లింది. ఈ విషయాన్ని దీక్ష నిర్వాహకులు గమనించినట్టు లేరు. ముందుగానే దీక్ష తేదీల్లో కొంత మార్పు చేసి ఉంటే బావుండేది.
దీక్ష ఫలాలు ఎప్పుడు అందుతాయో కానీ ఆ తర్వాత ఏం చేయాలనే దానికి జగన్ కు రోను తుపాను రూపంలో కలిసివచ్చింది. ఆంధ్రప్రదేశ్ ను ముంచెత్తుతున్న తుపాను ముగిసింది మొదలు చంద్రబాబును దుమ్మెత్తి పోయవచ్చు. ముందస్తుగా చర్యలు తీసుకోలేదని ఆరోపించవచ్చు. బాధీతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పవచ్చు. సహాయ చర్యలు అందడం లేదని తన మీడియాలో ప్రత్యేక కథనాలు రాయించవచ్చు. ఇంకా అనేక విధాలుగా ఆరోపణలు చేసే అవకాశం ఉంది. ఈ విధంగా జగన్ కు రోను తుపాను కలిసివచ్చింది.