అల్లు అర్జున్ నోరు విప్పాడు. సరైనోడు థ్యాంక్స్ మీట్ లో పవన్ గురించి నాలుగు మాటలు మాట్లాడితే పోయేదానికి చాంతాడంత వివరణ ఇచ్చుకునే వరకు పరిస్థితి తెచ్చుకున్నాడు. వేడుకల్లో పవర్ స్టార్...పవర్ స్టార్ అని అభిమానులు ఉత్సాహంగా అడగడం ఆయన దృష్టిలో తప్పుగా కనిపించింది. తనకు మాత్రమే పరిమితమైన వేడుకలో కూడా పవన్ పేరు వినిపించడం నచ్చలేదేమో. ఈ విషయాన్ని మీడియా ద్వారా వారికి సున్నితంగా చెబితే సరిపోయేది. గోటితే పోయేదానికి గొడ్డలి వరకు తెచ్చుకున్నాడు. పర్యవసానం తండ్రి మందలింపు, చిరంజీవి ఇబ్బంది వెరసి వివరణ ఇచ్చుకునే వరకు వెళ్లింది.
ఒక విధంగా బన్నీ అభిమానులకు మంచే చేశాడు. సర్దార్.. ఫ్లాప్ తో నీరసపడి ఉన్న వారికి తన కామెంట్ ద్వారా ఉత్సాహాన్ని తెచ్చాడు. ఫ్లాప్ తాలుకు జ్ఞాపకాలు మరిచేలా చేశాడు. వేడుకల్లో ఒక స్టార్ హీరోకు విపరీతమైన ఫాలోయింగ్ ఉన్నపుడు అభిమానులు రెచ్చిపోతారు. గోల చేస్తారు. ఇది సహజమే. పవన్ మేనియా మామూలుది కాదు. అందుకే మెగా కుటుంబానికి సంబంధించి ఎలాంటి వేడుక జరిగిన పవన్ ప్రస్తావన తప్పకుండా ఉంటుంది.
మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న హీరోలు బయటకు వెళ్లినపుడు కూడా ఇబ్బంది పడిన సందర్భాలున్నాయి. అభిమానులే దేవుళ్ళు అని అంటారు కాబట్టి ఒక్కోసారి వాటిని భరించకతప్పదు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నదే.
అల్లు అర్జున్ లో ఇంకా పరిపక్వత రాలేదని ఆయన మాట్లాడినదానిని బట్టి స్పష్టమవుతోంది. చిరంజీవి జపం చేసే ఆయన పవన్ ప్రస్తావన వస్తే మాత్రం తట్టుకోలేకపోతున్నారు. అల్లు అరవింద్ కుటుంబాన్ని పవన్ ఎప్పుడో పక్కన పెట్టేశారు. ఇది కూడా ఒక కారణం. తనకు హిట్ సినిమాలు ఉన్నప్పటికీ తన గురించి కాకుండా పవన్ గురించి అభిమానులు తరచుగా ప్రస్తావించడం సైతం బన్నీకి మింగుడుపడడం లేదు. అయితే అభిమానుల అండదండలతో ఎదిగిన హీరోలు వారికే నీతులు చెప్పే ప్రయత్నం చేస్తే మాత్రం సమస్య మరింత ముదురుతుంది. కొందరు అల్లరి చేస్తున్నారంటూ టార్గెట్ చేయడం వారిని ఆగ్రహానికి గురిచేస్తుంది.
అల్లు అరవింద్ కు మంచి వ్యూహకర్తగా పేరుంది. పవన్ విషయంలో కొడుకు తప్పు చేశాడని గ్రహించి పూర్తి వివరణ ఇప్పించే ప్రయత్నం చేశారు. ఇది కొంతవరకు బెటరే.
ఇక సరైనోడు వంద కోట్లు వసూలు చేసిందని ప్రచారం చేస్తున్నారు. దీని ఉద్దేశం ఏమిటీ, పవన్ ఫ్లాప్ సినిమా అంతకంటే ఎక్కువ కలెక్ట్ చేస్తుందనే విషయం బన్నీకి తెలియదా. పవన్ లాగే తనకు కూడా వంద కోట్ల మైలురాయి దాటే స్థాయి ఉందని చెప్పుకోవడం దేనికి సంకేతం. నిజానికి సరైనోడు యాభైకోట్ల క్లబ్ కే చేరలేదని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయం అల్లు వారి కుటుంబానికి తెలుసు. అయినప్పటికీ పవన్ ను టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. సర్దార్... ఫ్లాప్ కావడంతో సరైనోడు చిత్ర ప్రచారం ఉధృతం చేశారు. ఇది కావాలని చేసిందని అభిమానులు అనుమానిస్తున్నారు. తెరవెనుక ఇంతవ్యూహం పన్నినపుడు అభిమానులు ఆగ్రహించడం, వారి నిరసనను తెలియజేయడం సబబే అవుతుంది.
Advertisement
CJ Advs