మన దర్శకుల్లో చాలా మంది కథలు రాయడానికి వారికి నచ్చిన ప్రాంతానికి వెళ్తుంటారు. పూరి జగన్నాథ్ అయితే బ్యాంకాక్ కు వెళ్లి మరీ కథలు రాసుకుంటాడు. ఒక ఇంటర్వ్యూలో బ్యాంకాక్ నా సొంతూరులాగా అనిపిస్తుంది. అక్కడ నుండి హైదరాబాద్ వస్తే ఏదో కొత్త ప్లేస్ కు వచ్చాననే ఫీలింగ్ కలుగుతుందని చెప్పాడు. అలానే మరికొంత మంది దర్శకులు ఇంట్లో కూర్చొని రాసుకోవడానికే ఇష్టపడుతుంటారు. కుటుంబ కథలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాత్రం కథలు రాయడానికి తన సొంతూరు రేలంగికి వెళ్లిపోతాడట. ఓ నాలుగైదు నెలల పాటు అక్కడే సమయాన్ని కేటాయించి కథను సిద్ధం చేసుకుంటాడట. ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహించిన 'బ్రహ్మోత్సవం' సినిమా మే 20న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా శ్రీకాంత్ కొన్ని విషయాలను వెల్లడించారు. కథలు రాసుకునేప్పుడు మాత్రం పాత్రలకు పేర్లు రాసుకోనని చెప్పాడు. అంతేకాదు తనను కూడా ఎవరు పేరు పెట్టి పిలవరట. స్నేహితులంతా.. అరేయ్, ఒరేయ్ అని పిలుస్తుంటారని, తన తల్లి మాత్రం ఇంట్లో చిన్ని అని పిలుస్తుందని చెప్పుకొచ్చారు.