సమైఖ్య రాష్ట్రాన్ని కిందటి అధికారపక్షం యూపీఏ, ప్రతిపక్ష ఎన్డీయేలు కలిసి రెండుగా విడదీశాయి. పార్లమెంట్ సాక్షిగా జరిగిన ఈ పరిణామం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని బజారులో పెట్టింది. ఇప్పటికీ ఆ సంఘటన తలుచుకుంటే ఏపీ ప్రజల మనసు భగ్గుమంటోంది. ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా కల్పిస్తామని నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ చెబితే కాదు పదేళ్లు కావాలని బిజెపి నేత వెంకయ్యనాయుడు రాజ్యసభ సాక్షిగా మాట్లాడారు. ఈ విషయాన్ని బిజెపి తన ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా పెట్టింది. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి వెంకన్న సాక్షిగా నేటి ప్రధాని మోడీ ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుతం మాత్రం బిజెపి నాయకులు అది సాధ్యం అయ్యే పనికాదని చెబుతున్నారు. అదేమంటే అన్ని విధాలుగా తాము ఏపీని ఆదుకొంటున్నామని, ప్రత్యేకహోదా వస్తే మిగిలిన ప్రత్యేకహోదా ఇచ్చిన 11 రాష్ట్రాలలాగానే ఏపీకి కేవలం 700కోట్లు మాత్రమే వస్తాయని, కానీ తాము వేల కోట్లు రాష్ట్రానికి ఇస్తున్నామని రాష్ట్ర బిజెపి నాయకుడు సోము వీర్రాజు ఫైర్ అవుతున్నారు. ఎన్నో రాష్ట్రాలు విడిపోయాయని, కానీ ఏ రాష్ట్రం కూడా ఏపీ కోరినట్లు రాజధానికి లక్షల కోట్లు అడగలేదంటూ ముక్తాయింపును ఇచ్చారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా కేంద్రంలోని బిజెపిసర్కార్ ఏపీని ప్రత్యేక రాష్ట్రంగా చూస్తోందని సెలవిచ్చారు. అయితే ఏపీ ప్రజలు తమ హక్కుగా మాత్రమే ప్యాకేజీలను, ప్రత్యేకహోదా కావాలంటున్నారు తప్పితే అడుక్కోవడం లేదు. విభజన చట్టం ప్రకారం మనకు రావాల్సిన నిధులు కావాలంటున్నారు. ఇక పార్లమెంట్ సాక్షిగా తమకు ఇస్తామని చెప్పిన ప్రత్యేక హోదా కావాలి తప్పితే కేంద్రం ముష్టిగా చేసే సహాయం కోసం ఏ ఏపీ వ్యక్తి కూడా చేయిచాపడం లేదు.