వైకాపా అధ్యక్షుడు జగన్ జల దీక్ష కు శ్రీకారం చుట్టారు. రెండు, మూడు రోజులుగా దీనికి సంబంధించి సాక్షి మీడియాలో నాన్ స్టాప్ కవరేజ్ ఇస్తున్నారు. సొంత మీడియా కాబట్టి ఈ మాత్రం కవరేజ్ తప్పదు. అయితే సోమవారం దీక్షాదక్షుడు అంటూ ఇచ్చిన ఫుల్ పేజీ కవరేజ్ లో గతంలో జగన్ చేసిన 26 దీక్షల గురించి పేర్కొన్నారు. తాజాగా చేస్తున్న జలదీక్ష 27వది. ఇంతవరకు బాగానే ఉంది. జగన్ చేసిన 26 దీక్షల గురించి సమాచారం ఇచ్చి, అతనికి హీరోయిజం ఆపాదిద్దామని సాక్షి భావించినట్టుంది. కానీ ఇక్కడే పప్పులో కాలేసింది. గత దీక్షల గురించి చదివిన ఎవరికైనా సరే గతంలో చేసిన 26 దీక్షల వల్ల జగన్ ఏమీ సాధించలేకపోయారనేది స్పష్టమైంది. జగన్ దీక్షలు ప్రభుత్వాన్ని, ప్రజలను కదిలించలేకపోయాయని సామాన్యులకు సైతం సాక్షి తెలియజేసినట్టయింది. దీక్షలు, ధర్నాల వల్ల నాయకులు సాధిస్తున్నదేమిటీ?, అదీ కాకుండా ఇన్ స్టెంట్ గా అంటే 24 గంటలు 48 గంటలు 72 గంటలు ఇలా టైమ్ లిమిట్ పెట్టుకుని చేస్తే సమస్య పరిష్కారమవుతుందా? అనేది వైకాపా నేతలే చెప్పాలి. అక్రమ ప్రాజెక్ట్ లను కేసీఆర్ కడుతున్నారని, చంద్రబాబు అడ్డుకోలేకపోతున్నారనేది జగన్ ఆరోపణ. నిజానికి ఒక నాయకుడు తమ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని భావిస్తే, అక్రమ ప్రాజెక్ట్ లు కడుతున్న వారిపై విరుచుకు పడాలి. కానీ వైకాపా మాత్రం కేసీఆర్ ను, తెలంగాణ ప్రభుత్వాన్ని ఒక్కమాట కూడా అనకుండా బాబుపైనే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దీనికి వెనుక మతలబు ఏమిటో వారే ప్రజలకు చెప్పాలి.