ఇటీవల విజయవాడలో జరిగిన సరైనోడు ఫంక్షన్‌లో పవన్‌కళ్యాణ్ గురించి మాట్లాడమని అభిమానులు కోరినప్పుడు అల్లు అర్జున్ ఇచ్చిన రియాక్షన్ ఎలాంటిదో తెలిసిందే. పవన్ గురించి నేను చెప్పను బ్రదర్... అని అన్న ఆయన మాటలు సంచలనం సృష్టించాయి. ఆ మాటల గురించి పవన్ అభిమానులు బన్నీపై కినుక వహించేవరకు వెళ్లాయి. మరి బన్నీ ఏ ఉద్దేశంతో ఆ మాటన్నాడో తెలియదు కానీ ఆ మాటలు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో హల్ చల్ చేశాయి. బన్నీ ఇలా అన్నాడు, అలా అన్నాడు అంటూ మెగా ఫ్యాన్స్ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇలాంటి విషయాలతో మెగాఫ్యాన్స్‌లో రెండు చీలికలు ఏర్పడతాయన్న అభిప్రాయాలు కూడా వినిపించాయి. దీనిపై అభిమానులకు సర్దిచెప్పేందుకు నాగబాబు రంగంలోకి దిగాడని వార్తలొచ్చాయి. ఇంత జరుగుతుందని అల్లు అర్జున్ కూడా ఊహించుండడని, ఇక ఆయన మరోసారి అలా మాట్లాడకపోవచ్చని బయట జనాలు మాట్లాడుకున్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఆ విషయంలో వెనక్కి తగ్గడం లేదని అర్థమవుతోంది. ఈనాడుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని జర్నలిస్టులు ప్రస్తావించినప్పుడు నేను మళ్లీ అదే చెబుతున్నా. పవన్ గురించి మాట్లాడను బ్రదర్. ఇంకో ప్రశ్న అడుగు అన్నాడు. ఇది ఫ్యాన్స్‌కి మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది. పవన్ గురించి ఎప్పుడూ గొప్పగా మాట్లాడే బన్నీ ఉన్నట్టుండి ఇలా ఎందుకు మొండికేస్తున్నాడని, పవన్ గురించి ఎందుకు మాట్లాడటం లేదని పరిశ్రమ వర్గాలు సైతం చర్చించుకుంటున్నాయి. మరి ఈ విషయం ఎక్కడిదాకా వెళుతుందో చూడాలి.