ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం నుండి నిధులు తెచ్చుకోవాలనే లక్ష్యంతో ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణకు కేంద్రం నుండి మరిన్ని నిధులు కావాలని కోరారు. అయితే కేంద్రం మాత్రం తమ పరిస్థితే ఇబ్బందిగా ఉందని, దాంతో తెలంగాణకు అదనపు నిధులు ఇవ్వలేమని స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే తెలంగాణకు కేంద్రం మొండి చేయి చూపించిందనే నిందలు రాకుండా ఆర్థికంగా కేంద్రం పరిస్థితి చాలా ఇబ్బందుల్లో ఉందని చెప్పింది. దీంతో కేసీఆర్ ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఎదురైంది. అయితే కేంద్రం ఇలా చెప్పడం వెనుక బిజెపి అగ్రనేతలు వ్యూహం దాగివుందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పిన కేంద్రం భవిష్యత్తులో తమ ఆర్దికపరిస్థితి బాగాలేదనే చెప్పి, ఏపీకి ఇవ్వాల్సిన రెవిన్యూలోటు, పోలవరం, రాజధానికి నిధులు వంటి విషయంలో చంద్రబాబు ముందు కాళ్లకి బంధాలు వేయడానికి సిద్దం అయిందని, అందులో భాగంగానే కేసీఆర్‌కు ముందస్తుగా రిక్త హస్తం చూపించదని విశ్లేషిస్తున్నారు.
అదే తెలంగాణకు ఇచ్చి, రేపు ఏపీకి ఇవ్వకపోతే అసలుకే మోసం వస్తుందని గ్రహించే బిజెపి అగ్రనేతలు ఇలా ప్లాన్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అన్ని విషయాలలోనూ ఏపీకి మొండిచేయి చూపించడానికి మానసికంగా బిజెపి సిద్దంగా ఉందని తెలుస్తోంది. ఎటు తిరిగి చంద్రబాబు కేంద్రానికి, బిజెపికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఉందని గమనించే కేంద్రంలోని పెద్దలు ఇలా వ్యవహరిస్తున్నారని, చంద్రబాబు ఏమీ చేయలేడనే ధీమా, ఆయనకు ఉన్న రాజకీయ ఇబ్బందులను తెలివిగా వాడుకొని పావులు కదపాలని కేంద్రం భావిస్తోంది.మరి ఇప్పటికైనా చంద్రబాబు న్యాయపరంగా, చట్టబద్దంగా మనకు రావాల్సిన వాటిని పోరాడి తీసుకొచ్చే ప్రయత్నం చేయకపోతే అది చంద్రబాబు చేతకానితనానికి నిదర్శనం అవుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.