ఎన్టీఆర్ కుటుంబంతో మోహన్‌బాబుకున్న అనుబంధం ప్రత్యేకమైనది. ఎన్టీఆర్ ప్రస్తావన ఎప్పుడొచ్చినా మా అన్నగారు అంటూ ఆప్యాయంగా సంబోధిస్తుంటారు. ఎన్టీఆర్ కూడా ఆయన్ని అలాగే చూసేవారు. డైలాగులు చెప్పడంలో నా తర్వాత మోహన్‌బాబే అనేవారట. ఎన్టీఆర్‌తో మేజర్ చంద్రకాంత్ సినిమాని నిర్మించి ఆయన మరో ఘన విజయం అందుకోవడానికి మోహన్‌బాబే కారణమయ్యారు. అప్పట్నుంచి ఆ ఇద్దరి మధ్య మరింత అనుబంధం ఏర్పడింది. ఎన్టీఆర్ మరణం తర్వాత కూడా ఆ కుటుంబంతో సంబంధ బాంధవ్యాలు మెంటైన్ చేస్తున్నారు మోహన్‌బాబు. ఎన్టీఆర్ వారసుడైన బాలకృష్ణ, మోహన్‌బాబు ఎప్పుడు ఎక్కడ కలిసినా అన్యోన్యంగా మాట్లాడుకుంటుంటారు. తన పిల్లలు తీసిన సినిమాలో నటించమని ఒక్క మాట అడిగేసరికి కాదనకుండా 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా' సినిమాలో నటించాడు బాలయ్య. అలాంటి రిలేషన్ వాళ్లది. ఆ అనుబంధాన్నంతా బయట పెట్టే అవకాశం బాలకృష్ణకి ఇటీవల మరోసారి దొరికింది. మోహన్‌బాబు 40యేళ్ల సినీ ప్రయాణాన్ని పురస్కరించుకొని డైలాగ్ బుక్‌ని విడుదల చేశారు. బ్రిటన్ పార్లమెంట్‌లో ఆ బుక్‌ని విడుదల చేయడం విశేషం. ఆ పుస్తకానికి ముందు మాటని బాలకృష్ణతో రాయించారు. ఈ సందర్భంగా మోహన్‌బాబుతో ఉన్న అనుబంధాన్ని అందులో బయటపెట్టారు బాలయ్య. ఒక వ్యక్తిగా.. నటుడిగా...నాకు మానాన్నగారు స్ఫూర్తి అయితే, ఆయన తర్వాత నాకు అంతగా స్ఫూర్తినిచ్చిన వ్యక్తి మోహన్ బాబుగారే అని బాలయ్య అందులో స్పష్టం చేశారు. క్రమశిక్షణతో, ధృడ సంకల్పంతో తను అనుకున్న దారిలో ముందుకుసాగి ఇండివిడ్యువల్ గా ప్రత్యేక గుర్తింపు పొందారని పొగిడారు. ఆయన డైలాగ్ డిక్షన్ అద్భుతమనీ, సర్దార్ పాపారాయుడు సినిమాలో నాన్నగారితో కలిసి నటించినప్పుడు చెప్పిన 'మా వంటవాడు భారతీ..యుడు, మా తోటవాడు భారతీ..యుడు' లాంటి డైలాగులంటే నాకెంతో ఇష్టమన్నారు. నటనలో కావచ్చు...డైలాగ్ డెలివరీలో కావచ్చు...ఎంతో మంది ఆయన్ను అనుకరించి బ్రతికారని బాలకృష్ణ అందులో రాసుకొచ్చారు.