తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యుడు బుద్దా వెంకన్న మంచి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబునాయుడు విదేశాల్లో ఉన్నా రాష్ట్రం గురించే ఆలోచిస్తున్నారని, ఏపీలో మరో 30ఏళ్ల వరకు టిడిపి నాయకత్వమే నాయకత్వం వహిస్తుందని సెలవిచ్చారు. టిడిపికి చంద్రబాబు కుటుంబమే నాయకత్వం వహిస్తుందని చెప్పి తద్వారా లోకేష్ బాబే ముఖ్యమంత్రి అవుతారని చెప్పకనే చెప్పారు. లోకేష్ కోసం ఇప్పటికే కొంతమంది నేతలు తమ పదవులను వదులుకునేందుకు కూడా సిద్దంగా ఉన్నారని వెంకన్న చెప్పారు. అయితే లోకేష్ మాత్రం తాను ఇప్పుడే కాదని, 2019కి సిద్దంగా ఉన్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. జగన్‌పై ఆ పార్టీ ఎమ్మేల్యేలకే నమ్మకం లేదని, త్వరలో వైసిపి టిడిపిలో విలీనం కావడం ఖాయమన్నారు. కాపులకు రిజర్వేషన్లు విషయంలో మైండ్ గేమ్ ఆడాల్సిన అవసరం ఎంత మాత్రము లేదని, ఎవరినీ ఈవిషయంలో బ్లాక్‌మెయిల్ చేయాల్సిన అవసరం కూడా లేదని, అలాగే ప్రభుత్వాన్ని ఎవరు బ్లాక్ మెయిల్ చేయలేరని వెంకన్న తెలిపారు.
మరోవైపు ఆయన ప్రత్యేకహోదా విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. కానీ ఆయనకు కౌంటర్‌గా సిపిఐ నేత నారాయణ మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మోడీ, చంద్రబాబు, వెంకయ్యనాయుడులు మూడు కోతుల్లా ప్రత్యేకహోదా గురించి వినవద్దు, చూడవద్దు, మాట్లాడవద్దు.. అనే విధంగా ప్రవర్తిస్తున్నారని, ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చి వెంకయ్యనాయుడు తన మాతృగడ్డ రుణం తీర్చుకోవాలని హితవు పలికారు. మరోవైపు ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై బిజెపి ఫైర్‌బ్రాండ్ సోము వీర్రాజు ఘాటు విమర్శలు చేశారు. ఒకప్పుడు ఇదే చంద్రబాబు మాట్లాడుతూ... ప్రత్యేక హోదా అన్నింటికీ సంజీవని కాదని, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు కూడా అభివృద్దికి నోచుకోని అంశాన్ని గమనించాలని, ప్రత్యేక హోదా లేకుండా కూడా అభివృద్దిని సాధించవచ్చు అనే అంశాన్ని తెలుసుకోవాలని చంద్రబాబు మాట్లాడిన మాటలు వాస్తవం కాదా? ఇప్పుడు మాత్రం చంద్రబాబు ప్రత్యేకహోదాపై మాటమారుస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించాడు. సో.. రోజు రోజుకి ప్రత్యేకహోదా విషయంలో మిత్రపక్షాలైన టిడిపి, బిజెపిల మధ్య మాటల యుద్దం వేడెక్కుతోంది.