కేసీఆర్ రాజకీయ వారసుడు కేటీఆర్ తండ్రిలాగే వ్యూహకర్త. ఎలాంటి గంభీరవాతావరణాన్ని అయినా కేసీఆర్ తేలికపరుస్తారు. సరిగ్గా కేటీఆర్ అంతే. కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ కు సవాల్ విసిరి, మళ్లీ ఆ సవాల్ ను తనకే ఆస్వాదించుకున్నారు. తన సవాల్ ను ప్రత్యర్థులు స్వీకరించనప్పటికీ, పాలేరులో తెరాస ఓడితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. నిజానికి ఇది ఛాలెంజ్ లాంటిదే. ప్రత్యర్థులకు బెదురుపుట్టించేదే. ఇలాంటి లక్షణాలు తండ్రి నుండి సంక్రమించినవే.
ఇప్పటికే పాలేరులో వీధివీధి ప్రచారం చేసి హైదరాబాద్ చేరుకున్న కేటీఆర్ బుధవారం మీడియాకు ప్రత్యేక ఇంటర్య్వూలు ఇచ్చారు. పిలిచిందే తడవుగా న్యూస్ ఛానల్స్ ఆయన ఇంటికి పరుగెట్టాయి. కూచోబెట్టి కొందరు, నించోబెట్టి మరికొందరు ఇంటర్య్వూ చేశారు. సరిగ్గా గ్రేటర్ ఎన్నికల ముందు కేసీఆర్ మూడు గంటలు మీడియా సమావేశం నిర్వహించి ఓటర్లను ఆకట్టుకున్నారు. అదే తరహాలో కేటీఆర్ ఛానల్స్ ద్వారా పాలేరు ఎన్నికల ప్రచారం చేసి తన చతురత చాటుకున్నారు.
తెలుగు మీడియాకు కేటీఆర్ అంటే భయం, భక్తి ఉన్నాయి. కాబోయే ముఖ్యమంత్రిగా తరచుగా మీడియా ప్రచారం చేస్తూనే ఉన్నా, దీనిని కేటీఆర్ ఖండిస్తూ, అలాంటి ఉద్దేశమే లేదని స్పష్టం చేస్తుండడం తరచుగా జరుగుతుంటుంది. ఒకవైపు తెరాసలో తన బలం, బలగం పెంచుకోవడం కోసం కేటీఆర్ నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కేసీఆర్ సైతం ఎన్నికల సమయంలో బాధ్యతలు కేటీఆర్ కే అప్పచెపుతుంటారు. దీనివల్ల తన తర్వాత కేటీఆరే అని సందేశాన్ని తెలంగాణ ప్రజలకు చేరవేస్తున్నారు.