మహేష్ ఓల్డ్ గెటప్ వేసుకొని ఆత్రేయరా... అని అరిస్తే ఎలా వుంటుంది? మీసాలు తీసేసి అద్దాలు పెట్టుకొని ల్యాబ్‌లో గడిపే ఓ సైంటిస్ట్‌గా కనిపిస్తే? అసలు హీరోయిజమన్నదే లేకుండా... నేను వాచీ మెకానిక్ మేడమ్, ఇవన్నీ నాకు మామూలే అని పదే పదే చెప్పే మణిశంకర్ పాత్రలో సందడి చేసుంటే? అసలు ఆ పాత్రల్లో మహేష్‌ని ఊహించుకోవడమే కష్టమవుతోంది కదా! మహేష్‌కి కూడా అలాగే అనిపించుంటుంది. అందుకే ఆ కథ చెప్పగానే నో అనేశాడు. ఆ తర్వాతే ఆ కథ సూర్య దగ్గరకి వెళ్లింది. 24 గా తెరకెక్కింది. నమ్మకలేకపోతున్నారా? ఇది నిజం. దర్శకుడు విక్రమ్ మొదట 24 కథని మహేష్‌కే వినిపించాడట. కానీ అది నా స్టైల్‌కి తగ్గట్టుగా లేదని చెప్పడంతో మీకోసం మరో కథ రెడీ చేస్తానని చెప్పి విక్రమ్ వెళ్లిపోయాడట. సూర్యని ఒప్పించి ఆ సినిమా తీసేశాడు. నిన్ననే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆ చిత్రం ఘన విజయం దిశగా దూసుకెళుతోంది. తెలుగు, తమిళ భాషల్లో సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. మరోపక్క బాలీవుడ్ జనాలు కూడా ఆ సినిమా గురించి ఆరా తీస్తున్నారు. తప్పకుండా రీమేక్ అయ్యే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆ సినిమా రిజల్ట్‌ని చూసి మహేష్ అభిమానులు మాత్రం ఫీలవ్వడం లేదు. ఎవరు ఎలాంటి సినిమాలు చేయాలో అలాంటివే చేయాలనీ, మహేష్‌కి 24 సెట్టయ్యుండేది కాదని మాట్లాడుకుంటున్నారు. సూర్య 24 తరహా కథలకి, అలాంటి పాత్రలకీ పెట్టింది పేరు. ప్రయోగాత్మకంగా రూపొందే పాత్రల్లో ఆయన ఒదిగిపోతుంటాడు. కానీ మహేష్‌కి ఉన్న ఇమేజ్ వేరు. ఆయన మాస్‌ని మెప్పించేలా కనిపించాలి. ఆయన పాత్రల్లో అడుగడుగునా హీరోయిజం కనిపిస్తుండాలి. అలా జరగలేదంటే కుటుంబ అనుబంధాల మధ్యైనా ఆయన కనిపించాలి. మహేష్‌ని అలాంటి పాత్రల్లో చూడటమే ప్రేక్షకులకు అలవాటైంది. అందుకే మహేష్ కూడా ఆ తరహా కథల్నే ఒప్పుకుంటుంటాడు. మరి తదుపరి మహేష్ కోసం విక్రమ్ ఎలాంటి కథ సిద్ధం చేశాడో చూడాలి.