ఏపీకి ప్రత్యేక హోదా విషయం విభజన చట్టంలో లేదని వాదిస్తున్న బిజెపి అగ్రనాయకత్వం రెవిన్యూ లోటుతో పాటు ఏపీలో ప్రత్యేక రైల్వేజోన్, పోలవరం వంటి విషయాల్లో కూడా చేతులెత్తేసే పరిస్థితిలో ఉంది. రెవిన్యూ లోటును తాము తీర్చలేమని, అలాగే పోలవరంకు కావాలంటే రుణం ఇప్పిస్తామని ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ వివరించారు. పోలవరం విషయంలో బిజెపి మంత్రులైన అరుణ్‌జైట్లీ, ఉమాభారతి పరస్పర విరుద్దవ్యాఖ్యలు చేస్తున్నారు. ఉమాభారతి పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ కావడంతో మొత్తం నిదులు కేంద్రమే భరిస్తుందని చెబుతుంటే, అరుణ్‌జైట్లీ మాత్రం కేవలం రుణంగా మాత్రమే ఆ ప్రాజెక్ట్‌కు నిధులు ఏర్పాటు చేస్తామంటున్నారు. ఇక రైల్వేజోన్‌ను విశాఖకు ఇచ్చినంత మాత్రాన అది కేంద్రానికి ఏవిధంగానూ నష్టం లేదు. కానీ కేంద్రం అది ఇవ్వడానికి కూడా సిద్దంగా లేదు. ఇక ప్రతిరాష్ట్రం రాజధాని నుంచి దేశరాజధాని ఢిల్లీకి రాజధాని ఎక్స్‌ప్రెస్‌ల పేరుతో రైళ్లు నడుస్తున్నాయి. దాంతో ఏపీ కొత్త రాజధాని అయిన అమరావతి నుండి విజయవాడ, విశాఖపట్టణం మీదుగా ఢిల్లీ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను నడపాలని తెదెపా ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. కానీ నిధులు, నిర్వహణ విషయంలో చాలా ఇబ్బందులు ఉండటంతో తాము అమరావతి నుండి ఢిల్లీకి రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను ఏర్పాటు చేయలేమని కూడా బిజెపి కుండబద్దలు కొట్టింది. ఇదంతా చూస్తుంటే మనసులో ఏపీపై ఏదో కసితోనే కేంద్రం ఇలా ప్రవర్తిస్తుందనే నిర్ణయానికి రాకతప్పదు. వాస్తవానికి ఇప్పుడు ఏపీకి ఏం సాయం చేసినా అది టిడిపి ఖాతాలోకి, చంద్రబాబు ఖాతాలోకి వెళ్లిపోతుందనే ఉద్దేశ్యంలో బిజెపి ఉంది. అలాంటప్పుడు తాము ఇవ్వన్నీ చేయడం దేనికి? అని బిజెపి నాయకుల ఆలోచనగా తెలుస్తోంది. ఏపీకి ఏమి చేసినా క్రెడిట్ అంతా బిజెపి వచ్చేలా ప్లాన్ చేసుకోవాలన్నది బిజెపి వ్యూహం. ఏపీలో టిడిపిని అంటిపెట్టుకోవడం వల్ల బిజెపికి కొత్తగా వచ్చే లాభం ఏమీలేదని అధినాయకత్వం భావిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి బిజెపి ప్రత్యేకహోదా ఇచ్చినా, లేకపోతే వచ్చే ఎన్నికల తర్వాత ఇస్తామని చెబితే అది తమకు ప్లస్ అవుతుందనే ఆలోచనలో బిజెపి ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఇప్పటివరకు ఈ విషయంలో ఏమీ స్పందించని మోడీ దీనిపై ఎలా స్పందిస్తారో అన్నది తేలిన తర్వాతే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.