ఇంతకాలం అభివృద్ది కోసమే కేంద్రంలోని బిజెపి సర్కార్‌కు మద్దతు ఇస్తున్నామని చంద్రబాబు ప్రజలకు చెబుతూ వస్తున్నాడు. కానీ ఇప్పుడు బిజెపి బండారం నగ్నంగా బయటపడింది. మొన్న కేంద్ర హోంశాఖసహాయ మంత్రి చౌదరి, నిన్న కేంద్ర ఆర్ధికశాఖ సహాయమంత్రి జయంత్‌సిన్హా, నేడు సాక్షాత్తూ కేంద్రఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీలు ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని తేల్చిచెప్పడంతో ఇంతకాలం ప్రత్యేకహోదా వస్తుంది. కేంద్రంలోని బిజెపి సర్కార్ మనకు ఖచ్చితంగా ప్రత్యేకహోదా ఇస్తుంది అని నమ్మబలుకుతూ ప్రజలను మభ్యపెట్టిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నోట్లో పచ్చివెలగకాయ పడింది. ఈ షాక్ నుండి ఆయన ఇంకా కోలుకోలేదు. శ్రీకాకుళం పర్యటనలో కూడా అన్యమనస్కంగానే కనిపించారు. కాగా ఎంతో రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు తదుపరి తీసుకోబోయే నిర్ణయం ఏమిటనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ నుండి తెలుగుదేశం బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ముందుగా చంద్రబాబు కేంద్రంలోని తమ పార్టీకి చెందిన కేంద్రమంత్రుల చేత రాజీనామా చేయించాలనే భావనలో ఉన్నాడు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఐదు మంది మంత్రులు ఉన్నారు. వీరిలో వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ, నిర్మలాసీతారామన్‌లు బిజెపి మంత్రులు కాగా, అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరిలు టిడిపి మంత్రులు, ఒకేసారి ఎన్టీయే నుండి బయటకు రాకుండా ముందు తమ మంత్రుల చేత రాజీనామా చేయించాలని, కేంద్రంలో మాత్రం మిత్రపక్షంగానే వ్యవహరించాలనేది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. మరికొన్ని రోజుల తర్వాత బిజెపి వైఖరిలో ఏమాత్రం మార్పు రాకపోతే అప్పుడు ఎన్డీయే నుండి బయటకు రావాలనేది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. కాగా ఏపీలో ప్రతిపక్షనేత వైయస్ జగన్ ఎంతోకాలంగా కేంద్రంలోని టిడిపి మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. అదే తరుణంలో బిజెపికి కూడా మద్దతు ఉపసంహరించడం ద్వారా కేంద్రాన్ని ఇరుకున పెట్టాలనేది చంద్రబాబు వ్యూహం. ఇక రాష్ట్రం విషయానికి వస్తే ఆయన తన కేబినెట్‌లోని బిజెపి మంత్రులను అలాగే కొనసాగించాలనే నిర్ణయం తీసుకొని తన ఉద్దేశ్యాలను కేంద్రంలోని బిజెపి అగ్ర నాయకత్వానికి స్పష్టంగా తెలియజేసి తద్వారా వారిని ఇబ్బందిపెట్టే యోచనలోఉన్నాడు బాబు. మరి ఆయన వ్యూహాలు ఏమాత్రం ఫలితం ఇస్తాయో వేచిచూడాలి!