తిరుమల తిరుపతి దేవస్దానం (టిటిడి) పాలకమండలి పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టిడిపి సీనియర్‌నేత, తిరుపతి మాజీ ఎమ్మేల్యే చదలవాడ కృష్ణమూర్తి చైర్మన్‌గా, 19మందితో కూడిన పాలకమండలి గతేడాది మే 2న ప్రమాణం చేసింది. 19మందిలో ఇద్దరు తెలంగాణ టిడిపి ఎమ్మేల్యేలకు పాలకమండలిలో చోటిచ్చారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మేల్యే సండ్ర వెంకటవీరయ్య, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్యేల్యే సాయన్నలను గతేడాది పాలకమండలిలోకి తీసుకున్నారు. కానీ సాయన్న మాత్రం కేసీఆర్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌కు లొంగి టిఆర్‌ఎస్‌లో చేరాడు. అయితే సభ్యులందరి పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగించిన ప్రభుత్వం సాయన్న పదవీ కాలాన్ని పెంచడానికి మాత్రం ససేమిరా అంది. ఆ స్దానంలో మరొకరిని నియమించాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఆ స్దానంలో తెలంగాణ టిడిపి నేతలైన వారిని తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణకు చెందిన మహిళానేత శోభారాణి, అరికెల నర్సిరెడ్డి పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నారు. వీరిలో ఒకరిని సాయన్న స్దానంలో చోటు కల్పించనున్నారు.
అయితే ప్రస్తుతం సభ్యునిగా కొనసాగుతోన్న సండ్ర వెంకట వీరయ్య దాదాపుగా అందుతున్న సమాచారం ప్రకారం రాజ్యసభ ఎన్నికల నాటికి టిఆర్‌ఎస్‌లో చేరడానికి రెడీ అవుతున్నాడు. మరి ఈ విషయం తెలిసినా కూడా చంద్రబాబు టిటిడి పాలకమండలిలో ఆయన్ను మరో ఏడాది పొడిగించాలని నిర్ణయించడం చూస్తే ఆశ్చర్యం వేయకమానదు. ఆయనను మరలా ప్రసన్నం చేసుకొని టిఆర్‌ఎస్‌లోకి వెళ్లకుండా చూడటానికి ఈ పదవిని ఆయనకు బుజ్జగింపుగా ఇచ్చారా? లేక ఖచ్చితంగా ఆయన టిఆర్‌ఎస్‌లోకి వెళ్లడనే నిర్ణయానికి వచ్చిన తర్వాతే ఆయన పదవీ కాలాన్ని పెంచాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నాడా? అనే విషయంలో పలువురిలో అనుమానాలు మొలకెత్తుతున్నాయి. మరి ఈ విషయంలో సండ్ర ఎలా స్పందిస్తాడో వేచిచూడాల్సివుంది.