ఏపీలో రోజు రోజుకీ మిత్రపక్షాలైన టిడిపి, బిజెపిల మద్య దూరం పెరుగుతోంది. టిడిపి ఎంపీ అవంతి శ్రీనివాస్, టిడిపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు వింటే ఆరోజు మరెంతో దూరంలో లేదని అర్దమవుతోంది. బిజెపి మొదటి నుండి ఒక ఓటు రెండు రాష్ట్రాలు పేరుతో నినదించిందని వారు ఘాటుగా విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో నీతి ఆయోగ్ అంగీకరించడం లేదని చెబుతున్న బిజెపి రాష్ట్రవిభజన చేయమని నీతి ఆయోగ్ చెప్పిందా? అంటూ టిడిపి నేతలు నిలదీస్తున్నారు. పార్లమెంట్ తలుపులు మూసి రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విభజిస్తే... బిజెపి వారికి సహకారం అందించిందనే విమర్శలు చేస్తున్నారు. పోలవరం జాతీయ హోదా, రాష్ట్రానికి పదేళ్ల ప్రత్యేక హోదా వంటి హామీలను రాజ్యసభలో ప్రస్తావించిన వెంకయ్యనాయుడు ఇప్పుడు నోరెందుకు ఎత్తడం లేదని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. అదేమంటే తాము ఏపీకి తగిన నిధులు ఇచ్చామని చెబుతున్నారని, దమ్మిడి సాయానికి వంద లెక్కలు అడగడం ఏమిటని? టిడిపి నేతలు పబ్లిగ్గానే గళం ఎత్తుతున్నారు. తెలుగు ప్రజలను చులకన చేసిన ఇందిరాగాంధీ, సోనియా గాంధీలకు ప్రజలు విధించిన శిక్షనే బిజెపికి కూడా విధిస్తారని, త్వరలో ప్రత్యేక హోదా కోసం ప్రజలు ఉద్యమం చేస్తే దానికి కేంద్రానిదే బాధ్యత అని టిడిపి నాయకులు హెచ్చరిస్తున్నారు. రాజధానికి నిధులు అంటూ సన్నాయి నొక్కులు వల్లిస్తున్న బిజెపి పైసా కూడా విదిలించడం లేదని వారు మండిపడుతున్నారు.
కాగా రాయలసీమలో ఏర్పడిన కరువును చంద్రబాబు పట్టించుకోవడం లేదని, రాయలసీమకు చెందిన బిజెపి నాయకులు కడపలో రహస్యంగా సమావేశమయినట్లు సమాచారం. ఈ సమావేశంలో వారు గత ఎన్నికల్లో రాజంపేట నుండి పోటీ చేసి ఓడిపోయిన స్వర్గీయ ఎన్టీఆర్ కుమార్తె పురందరేశ్వరిని ముందు నిలిపి తాము టిడిపిపై ఉద్యమం చేయాలనే నిర్ణయానికి వచ్చారట. అంతేకాకుండా టిడిపిపై జరగబోయే యుద్దంలో సీనియర్ నాయకుడు, ఒకప్పటికి కాంగ్రెస్ మాజీ మంత్రి, కడప జిల్లాకు ఇన్‌చార్జ్‌గా కాంగ్రెస్ హయాంలో పని చేసిన కన్నా లక్ష్మీనారాయణను కూడా ముందుంచి తాము పోరాటం చేయాలనే నిర్ణయానికి బిజెపి నేతలు వచ్చినట్లుగా సమాచారం. మరి ఈ పోరు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో అన్న విషయం ఇప్పుడు అందరిలోనూ మొలకెత్తుతోంది. మరోవైపు బిజెపి అధినాయకత్వం మాత్రం 2019లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పటిలా బిజెపికి పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం లేనందున.. టిడిపిని పక్కనపెట్టి పవన్‌కళ్యాణ్, జగన్, టిఆర్‌ఎస్‌లను మంచి చేసుకోవాలని, వారి సీట్లు.. వచ్చే ఎన్నికల్లో కీలకంగా మారుతాయి కాబట్టి వారిని ఎన్డీఏలోకి ఆహ్వానించాలని భావిస్తున్నట్లు సమాచారం.