Advertisement
Google Ads BL

జగన్‌ సక్సెస్‌ అయ్యాడా?


వైఎస్‌ జగన్‌ అంటే లక్ష కోట్ల రూపాయల దోపిడీ దొంగ అనే ముద్ర వేయడంలో చంద్రబాబు నాయుడు సఫలీకృతుడైనాడు. ఎన్నో ఏళ్లుగా ఒక పథకం ప్రకారం ఆ ప్రచారాన్ని కొనసాగించి, జనం మెదళ్లలో ఆ భావాన్ని చొప్పించాడు చంద్రబాబు. ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు అందుకు ఆయనకు ఎంతగానో సహకరించాయి. సిబిఐ కేసులు ఆ ప్రచారం నిజమేనేమో అనే అభిప్రాయాన్ని కల్పించాయి. ఈ లక్ష కోట్ల నినాదం ఒక నీడవలే జగన్‌ను వెన్నాడుతూనే ఉంది. భూమి గుండ్రంగా ఉంటుంది. ఈరోజు పైనున్న భాగం రేపు దిగువకు దిగిరాక తప్పదు. పదేళ్లుగా తనను వేధించిన ఆ నినాదపు వేధింపును చంద్రబాబు మీదకు ప్రయోగించడంలో ఇప్పుడు జగన్‌ సఫలీకృతుడైనాడు. ఎంపరర్‌ ఆఫ్‌ కరప్షన్‌ పేరిట చంద్రబాబు అవినీతి లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలు దాటిందని వివరిస్తూ ఒక పుస్తకం ప్రచురించాడు జగన్‌. దాన్ని ఎమ్మేల్యేలతో కలసి ఢిల్లీ వెళ్లినప్పుడు కేంద్రంలోని మంత్రులు, అధికారులందరికీ పంచి పెట్టాడు. తన లక్ష కోట్ల కంటే చంద్రబాబు అధికంగా దోపిడీ చేశాడని వివరించి చెప్పాడు. అమరావతి నగరం ఒక్క దానిలో లక్ష కోట్ల అవినీతి ఉందని ఈ పుస్తకం ఆరోపణ. కాంట్రాక్ట్‌లలో ఇపిసి పద్దతి రద్దు, ఫైబర్‌ ఆప్టిక్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్‌, మద్యం వ్యాపారుల సిండికేట్‌ మామూళ్లు, విద్యుత్‌ ప్రాజెక్ట్‌ల కమీషన్‌లు, నీరు-చెట్టు పథకం వంటి వాటిలో మరొక ముపై ఐదువేల కోట్ల వరకు అవినీతి అన్నది దీని సారాంశం. ఈ ఆరోపణలలో నిజం, నేతి బీరకాయలోని నెయ్యి ఉన్నంత మాత్రమే కావచ్చు. కానీ చంద్రబాబు పాలన అవినీతి మయం అన్న చర్చ అటు ఢిల్లీ వర్గాల్లో, ఇటు ప్రజలలో రేకెత్తించడంలో మాత్రం జగన్‌ సఫలీకృతుడైనట్లే లెక్క. 

Advertisement
CJ Advs

గతంలో వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 'రాజ ఆఫ్‌ కరప్షన్‌' పేరిట ఒక పుస్తకం వేసి అందరికీ పంచిపెట్టాడు బాబు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్లు ఇప్పుడు ఆ అస్త్రాన్ని తాను ప్రయోగించాడు జగన్‌. ఎమ్మేల్యేల వలసలతో ఇప్పటికే ఉప్పు నిప్పుగా ఉన్న ఈ ఇద్దరు నేతల సంబంధాలు ఈ పుస్తకంతో మరింత ముదిరిపాకాన పడుతున్నాయి. తనను అవినీతి పరుడిగా చిత్రించి ఢిల్లీలో ప్రచారం చేయడాన్ని చంద్రబాబు సహించలేకపోతున్నాడు. ఆయనకీ పరిణామం దుస్సహంగా ఉంది. ప్రధాన దిన పత్రికలు ఇంకా ఆయన మీద ఎంతో కొంత సానుభూతితో ఉన్నాయి. కాబట్టి ఈ ప్రచారం గతంలో వలే ఉపందుకోవడం లేదు. కానీ జగన్‌ వలె తన మీద కూడా జీవితకాలం అదొక మచ్చగా మిగిలిపోతుందన్న ఆవేదనతో రగిలిపోతున్నాడు చంద్రబాబు. ఇందుకు ప్రతీకారం- ఇప్పటికిప్పుడు ఎమ్మేల్యేల వలసను వేగవంతం చేయడం మాత్రమే. ఇప్పటికే 16 మంది వరకు జగన్‌ ఎమ్యేల్యేలు పచ్చ కండువాలు కప్పుకొన్నారు. మరొక ముగ్గురు అందుకు సిద్దంగా ఉన్నారు. అయితే ఈ సంఖ్య వల్ల చంద్రబాబుకు వచ్చే రాజకీయ ప్రయోజనం ఏమీలేదు. రేపటి రాజ్యసభ ఎన్నికలలో జగన్‌ వద్ద 36మంది మాత్రమే మిగిలినా ఒక సీటు నెగ్గుకొచ్చేస్తాడు. ఆయనకు ఆ అవకాశంలేకుండా చేయాలన్నది ప్రయత్నం, ఒక వేళ ఎమ్మేల్యేలు పార్టీ మారి రాకపోయినా రాజ్యసభ ఎన్నికల్లో వారి చేత ఓటు మార్పిడి చేయాలన్నది ఆలోచన. అందుకోసం ఒక స్వతంత్య్ర అభ్యర్థిని నిలబెట్టాలని చూస్తున్నారు. ప్రతి ఎమ్మేల్యేకు కనీసం రెండు కోట్ల రూపాయలు ఇవ్వగలిగిన స్థితిమంతుడిని వెతికి పట్టుకురాబోతున్నారని వినికిడి.

జగన్‌ వద్ద ఇప్పుడున్న ఎమ్మేల్యేల సంఖ్య 50మాత్రమే. అంటే వారిలో 15మంది చేత క్రాస్‌ ఓటింగ్‌ చేయించగలిగితే రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి ఎదురవుతుంది. దానివల్ల జగన్‌ రాజకీయంగా, మానసికంగా దెబ్బతింటాడని ఆశ. అదే సమయంలో చంద్రబాబు వ్యూహాలను ఎదుర్కొని రాజ్యసభకు విజయసాయిరెడ్డిని గెలిపించుకోగలిగితే జగన్‌కు రాజకీయ పునరుజ్జీవం కలుగుతుంది. అంటే ఈ ఎన్నిక ఈ ఇద్దరు నేతల మధ్య జీవన్మరణ సమస్యగా మారిందన్న మాట..! వారిసంగతేమో గానీ రాజ్యసభకు వెళ్లాలని ఎంతో కాలంగా చకోరపక్షిలా ఎదురుచూస్తున్న విజయసాయిరెడ్డికి మాత్రం ఇది పెనుభారంగా పరిణమిస్తున్నది. ఇప్పటి నుంచే ఎమ్మేల్యేల ఖర్చు భారాన్ని మోయక తప్పడం లేదాయనకు. మొన్న డిల్లీ యాత్రకు ఎమ్మెల్యేలను తీసుకువెళ్లినప్పుడు కూడా లెమెరిడియన్‌ హోటల్‌లో అందరికీ గదులు ఏర్పాటు చేసి విమాన టిక్కెట్లు ఇచ్చి అతిధి  మర్యాదలు చేశాడు విజయసాయిరెడ్డి. రేపు ఎన్నికల సమయంలో కూడా క్రాస్‌ ఓటింగ్‌కు మొగ్గుచూపే ఎమ్మేల్యేలను గమనించి వారి కోరికలు తీర్చే బాధ్యత సైతం విజయసాయిరెడ్డి మీదనే పెట్టాడట జగన్‌. తన జేబు నుంచి చిల్లిగవ్వ జారకుండా రాజకీయం చేయాలన్నది జగన్‌ ప్రయత్నం. తాజాగా వైకాపాకు రాజీనామా చేసిన సీనియర్‌ నేత మైసూరారెడ్డి కూడా ఇదే ఆరోపణ చేశాడు. జగన్‌కు డబ్బు పిచ్చి తప్ప మానవసంబంధాల మీద నమ్మకం లేదని వ్యాఖ్యానించాడాయన. అది చిన్న మాట కాదు. మైసూరా ఆ పార్టీలోకి వెళ్లడమే ఒక విశేషం. ఆయన అనుభవాన్ని రాజనీతిజ్ఞతను వాడుకోవడంలో విఫలం కావడం జగన్‌ అజ్ఞానం తప్ప వేరు కాదు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs