చిరంజీవి నా బిడ్డలాంటోడు. ఆయన మీద నాకెందుకు కోపం ఉంటుంది అంటున్నాడు దర్శకరత్న దాసరి. నాకు చిరంజీవికి మధ్య ఎప్పుడూ స్పర్దలు లేవు. అవన్నీ మీరు సృష్టించినవే అని తప్పును మీడియాపైకి నెట్టాడు దాసరి. బిడ్డ మీద తండ్రికి కోపం ఉంటుందా? అని ఆయన ప్రశ్నించాడు. కొందరికి తమ కుటుంబం నుంచి మాత్రమే వారసులు వచ్చారని, తనకు మాత్రం తను పరిచయం చేసిన వారంతా వారసులే అని సెలవిచ్చాడు. కానీ తనకు నిజమైన వారసుడు మాత్రం మోహన్‌బాబేనని ఆయన ప్రకటించాడు. ఇప్పుడు తన ఆడియన్స్ సినిమాలకు రాని కారణంగా చిత్రాలు తీయడం తగ్గించానని చెప్పాడు. పవన్‌తో తాను నిర్మాతగా ఓ చిత్రం చేస్తానని, అయితే ఈ చిత్రానికి తాను దర్శకత్వం వహించనని, ఈ చిత్రంలో పొలిటికల్ సెటైర్స్ ఉండవని, ఓ సోషల్ మేసేజ్‌తో కూడిన కమర్షియల్ చిత్రంగా అది ఉంటుందని తెలిపాడు. పవన్ చాలా గ్రేట్ అని, కేవలం తనకు సినిమా చేస్తున్నందుకు ఆ మాట అనడం లేదని, ఓ కమిట్‌మెంట్ ఉన్న వ్యక్తి ఆయన. తాను ఏమనుకుంటే అదే చేస్తాడు పవన్ ... అని కితాబు ఇచ్చాడు. తన డ్రీం ప్రాజెక్ట్ 'నర్తకి' చిత్రం అని, కానీ పవన్‌తో సినిమా పూర్తయినాక మాత్రమే ఆ చిత్రం గురించి ఆలోచిస్తానని దాసరి తెలిపాడు.