కృష్ణవంశీ సినిమా అంటే ఒక బ్రాండ్. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన కెరీర్ ఉంది. ఆయన దర్శకత్వంలో నటించాలని చాలామంది స్టార్ హీరోలు ఉత్సాహం చూపించేవారు. వంశీ సైతం ఏదిపడితే అది ఒప్పుకోరని అనేవారు. కానీ ఇప్పుడా పేరు పోయింది. మూడేళ్ళుగా సినిమాల్లేకుండా ఖాళీగా ఉన్న వంశీ పేరు ఇటీవల ప్రముఖంగా వినిపించింది. బాలయ్య వందవ చిత్ర దర్శకుడి పేరుల్లో ఆయన కూడా ఉన్నారు. అలాగే దిల్ రాజు కూడా కృష్ణవంశీతో సినిమా తీయడానికి చర్చలు ప్రారంభించారు. నాయికగా అనుష్కను అనుకున్నారు. వీటి గురించి ఆలోచిస్తున్న సమయంలోనే కృష్ణవంశీ నక్షత్రం పేరుతోఒక సినిమాకు శ్రీకారం చుట్టారు. ఇందులో ఎదుగుబొదుగు లేని సందీప్ కిషన్ కథానాయకుడు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సక్సెస్ ఎకౌంట్ లో డజను చిత్రాలు చేసిన సందీప్ హీరోగా నిలదొక్కుకోవడానికి తంటాలుపడుతున్నాడు. డైలాగ్ కు ఎక్స్ ప్రెషన్ కు సంబంధం ఉండదని ఆయనతో సినిమా తీసన డైరెక్టర్లే సెటైర్లు వేస్తుంటారు. కేవలం ఛాయాగ్రహకుడు చోటా కె.నాయాడు ప్రోద్బలంతోనే సందీప్ కు సినిమాలు వస్తున్నాయనేది అందరికీ తెలిసిన విషయమే. కృష్ణవంశీ, సందీప్ కాంబినేషన్ కుదిర్చింది కూడా చోటానే అని పరిశ్రమలో అంటున్నారు. సందీప్ కిషన్ తో సినిమా తీయడం అంటే వంశీ రిస్క్ చేస్తున్నారన్నమాటే. మార్కెట్ లో ఏ మాత్రం క్రేజ్ లేని హీరోతో చేయడం వల్ల వంశీకి ఒరిగేది ఏమీ ఉండదు. దీనికంటే కొత్త హీరోతో తీస్తే బావుండేదని కృష్ణవంశీ సన్నిహితులే అభిప్రాయపడుతున్నారు. ఖాళీగా ఉండలేక ఏదో ఒక సినిమా చేస్తున్నట్టు కనిపిస్తోందని ఫిల్మ్ నగర్ వర్గాలు సెటైర్లు విసురుతున్నాయి.