చెన్నై వరదల బీభత్సం ఇంకా కళ్ల ముందు మెదుల్తూనే ఉంది. చెన్నైని నిలువునా వరదల్లో మునిగిపోతుంటే దేశం మొత్తం ఎందరో చెన్నైకి బాసటగా నిలిచారు. వారిలో సినిమా నటులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ స్మృతి చిహ్నంగా అన్నట్లు తమిళ స్టార్ చియాన్ విక్రమ్ వీడియో తీసి వదిలాడు. చెన్నై విషాదానికి గుర్తుగా, చెన్నై వాసులకు ఇన్‌స్పిరేషన్‌గా ఎంతో హార్ట్ టచింగ్‌గా ఉన్న ఈ వీడియోలో దక్షిణాది నటీనటులతో పాటు బాలీవుడ్ తారలు కూడా నటించారు. అయితే చెన్నై భీభత్సం సమయంలో తెలుగు సినీ ప్రముఖులు కూడా తమ వంతుగా సాయం అందించి నిలబడ్డారు. ధైర్యం చెప్పడం, సానుభూతి వ్యక్తం చేయడంతో పాటు ఆర్దికంగా కూడా అండగా నిలిచారు. చివరకు సంపూర్ణేష్‌బాబు కూడా తన చేతనైనంత సాయం చేశాడు. అయితే విక్రమ్ తీసిన ఈ వీడియోలో ఒక్కరంటే ఒక్క తెలుగు నటుడు కూడా కనిపించలేదు. నిజానికి మన హీరోలకు తమిళనాడులో పెద్దగా మార్కెట్ లేదు. కానీ తమిళ సినిమాలకి మన తెలుగు సినిమాలతో సమానంగా మార్కెట్ ఉంది. రజనీకాంత్, కమల్‌హాసన్, సూర్య, విశాల్, కార్తిలతో పాటు విక్రమ్‌కు కూడా తెలుగులో మంచి గుర్తింపు ఉంది. కానీ విక్రమ్ తీసిన ఈ వీడియోలో తెలుగు నటులను పెద్దగా పట్టించుకోలేదు. మన వాళ్లకి డేట్స్ కుదరకున్నా? లేదంటే తెలుగు నటులను విక్రమ్ సంప్రదించలేదా? అనే అనుమానాలు మొలకెత్తుతున్నాయి. ఈ విషయంలో కొందరు టాలీవుడ్ ప్రముఖుల హర్ట్ అయ్యారని సమాచారం.