నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తన 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి కోసం దర్శకుడు క్రిష్ భారీ కసరత్తు చేస్తున్నాడు. చారిత్రాత్మక చిత్రం అంటేనే ఎంతో పరిశోధన, పరిశీలన ముఖ్యం. ముఖ్యంగా రాజుల కాలం నాడు వాడిన ఆయుధాలు, కవచాలు, రథాలు, కత్తులు.. ఇలాంటి వాటికోసం భారీ కసరత్తు చేయకతప్పదు. ఇక లోకేషన్లు కూడా ఆనాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఉండాలి. కాగా ఈచిత్రంలోని ఆయుధాలు, ఇతర యుద్ద సామగ్రి కోసం దర్శకుడు క్రిష్ ఏకంగా ఓ ఆయుధ ప్యాక్టరీని నెలకొల్పాడట. ఇక్కడే ఈ చిత్రానికి సంబంధించిన ఆయుధాలను తయారుచేయనున్నారు. ఇక చారిత్రాత్మక చిత్రం అంటే పరిశోధన ముఖ్యం. కాగా అమరావతిని కేంద్రంగా చేసుకొని పరిపాలించిన గౌతమీపుత్ర శాతకర్ణికి సంబంధించిన చారిత్రక విశేషాలను తిరుపతికి చెందిన శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాలలో సీనియర్ అధ్యాపకునిగా పనిచేసిన ఆచార్య రంగనాయకులు పరిశోధించి కథను అందించాడని, దాని ఆధారంగానే క్రిష్ స్క్రిప్ట్ తయారుచేస్తున్నట్లు సమాచారం. ఆయన గౌతమీ పుత్ర శాతకర్ణికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని క్రిష్‌కు అందిస్తున్నాడు. ఇటీవల జరిగిన ఈ చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా ఆచార్య రంగనాయకులును బాలయ్య ఆహ్వానించి ఘనంగా సత్కరించిన సంగతి తెలిసిందే. మే మొదటి వారం నుండి మూడు వారాలపాటు మొరాకోలో ఈ చిత్రం షూటింగ్ జరుగనుంది. కాగా చరిత్రకారుల ప్రకారం గౌతమీ పుత్ర శాతకర్ణికి మీసాలు ఉండవని తెలుస్తోంది. అయితే బాలయ్య మాత్రం ఇటీవల మీసాలతో జుట్టును కలిసే విధంగా మీసాలు పెంచి కొత్త గెటప్‌లో కనిపిస్తున్నాడు. సినిమాలో కూడా బాలయ్య ఇదే గెటప్‌తో కనిపించనున్నాడనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి చారిత్రక చిత్రాల్లో ఏమాత్రం పొరపాటు జరిగినా తీవ్ర విమర్శలు చెలరేగడం ఖాయమని చెప్పవచ్చు.