ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆపరేషన్ ఆకర్ష్‌కు ఆకర్షితులైన వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ కావడంతో చంద్రబాబు నిర్ణయాలను ఆ పార్టీ సభ్యులే లోలోపల వ్యతిరేకిస్తున్నప్పటికీ బయటకు మాత్రం నవ్వుతూ కనిపిస్తున్నారు. వైయస్సార్‌కాంగ్రెస్ పార్టీ నేతలను ఇలా చేర్చుకుంటూ ఉండటంతో పదేళ్లపాటు ఆ పార్టీ మరలా అధికారంలోకి రావడానికి జెండాలు మోసినవారు మాత్రం లోలోపల ఉడికపోతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం వారికి సర్దుకుపొమ్మని సలహా ఇస్తున్నాడు. మరీ కాదంటే ఏ కార్పొరేషన్ పదవినో ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటివరకు ఆ పార్టీ నాయకులు బహిరంగంగా తమ అసమ్మతిని బయటపెట్టలేదు. కానీ అందరూ ఒకలా ఉండరు కదా..! తాజాగా ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ టిడిపి తీర్ధం పుచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న అద్దంకి నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జ్ కరణం బలరాం మాత్రం చంద్రబాబుకు ముచ్చెమటలు పోయించాడు. అసలు ఇన్‌చార్జ్‌లు, స్ధానిక కార్యకర్తలు, నేతల సలహా తీసుకోకుండా గొట్టిపాటి టిడిపిలో చేర్చుకోవడానికి ఏకపక్షంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన నేరుగా ముఖ్యమంత్రిని కలిసి ఆయన మొహానే తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఇంతకాలం పార్టీని నమ్ముకున్న వారిని కాకుండా ఇప్పుడు తమ స్వార్ధం కోసం, తాము సంపాదించుకున్న అక్రమ సంపాదనను కాపాడుకోవడం కోసం కొందరు నాయకులు టీడిపిలో చేరుతున్నారని,కానీ చంద్రబాబు మాత్రం గుడ్డిగా వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని ఆయన మండిపడ్డాడు. ఆయన్ను శాంతింపజేయడానికి చంద్రబాబు కూడా నానా అవస్థలు పడాల్సివచ్చిందని సమాచారం. చివరకు ఆయనకు ఓ కార్పొరేట్ పదవి ఇస్తానని హామీ కూడా ఇచ్చాడు. అయినా కరణం బలరాం ఏమాత్రం తగ్గలేదు. గొట్టిపాటి రవికుమార్ టిడిపి తీర్ధం పుచ్చుకునే కార్యక్రమానికి తాము హాజరు కావడం లేదంటూ సీఎం చాంబర్ నుండి బయటకు వచ్చేశాడు. వాస్తవానికి ఇదే అసహనం ఎప్పటినుండో టిడిపిని నమ్ముకున్న వారిలో కనిపిస్తోంది. కానీ వారు ధైర్యంగా బయటకు ఆ విషయం చెప్పలేకపోతున్నారు. కానీ బలరాం మాత్రం తన కోపాన్ని వెళ్లగక్కి పార్టీ సామాన్య కార్యకర్తల మనోభావాలను ప్రతిబించించాడనే చెప్పాలి.