నాగచైతన్య వరస చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ ఆయన చిత్రాలు విడుదల విషయంలో, షూటింగ్ విషయంలో చాలా ఆలస్యమవుతున్నాయి. కాగా నాగచైతన్య ప్రస్తుతం గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో చేస్తున్న 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రం ఇటీవలే క్లైమాక్స్‌ను పూర్తి చేసుకుంది. దీంతో కొంత ప్యాచ్‌వర్క్ మినహా ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. మరోవంక ఆయన చందుమొండేటి దర్శకత్వంలో 'ప్రేమమ్' మలయాళ రీమేక్‌లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అదే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీఫిలింసిటీలో జరుగుతోంది. మొత్తం ఒక వ్యక్తి జీవితంలో జరిగిన మూడు ప్రేమకథల సమాహారంగా ఈ చిత్రం రూపొందుతోంది. మలయాళంలో కేవలం 4కోట్లతో రూపొందిన ఈ చిత్రం అక్కడ 60కోట్లు కొల్లగొట్టింది. కాగా ఈచిత్రం తదుపరి షెడ్యూల్ మే 3 వతేదీ నుండి రెండు వారాల పాటు గోవాలో చిత్రీకరించనున్నారు. ఇందులో నాగచైతన్య సరసన శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్‌లు నటిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్నిన జులై నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ఒక నెల గ్యాప్‌లో నాగచైతన్య నటిస్తున్న రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుండటంతో అక్కినేని అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.