దేశంలోనే వేలాది కోట్లకు పడగలెత్తిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, నెల్లూరీయుడైన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వైయస్సార్‌సీపీకి రాజీనామా చేశారు. నెల్లూరు జిల్లా సమన్వయ కమిటికి రాజీనామా చేశారు. చేతికి ఎముకలేని దానగుణం కలిగిన ఆయనంటే జిల్లా వాసులకు ఎంతో గౌరవం ఉంది. కాగా ఆయన మొన్న 19వ తేదీన విజయవాడకు వెళ్లి, యువరాజు లోకేష్‌బాబును కలిసి లాంఛనంగా మాట్లాడుకొని వచ్చిన తర్వాత వైయస్సార్‌సీపీకి రాజీనామా చేశారు. ఇక ముహూర్తమే తరువాయి. జిల్లా నేతలందరినీ పిలిచి విజయవాడలో ఏదో ఒక మంచిరోజు విపిఆర్ పచ్చ కండువా కప్పుకోనున్నారు. వాస్తవానికి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మదిలో రాజకీయ అభిలాష గత రెండేళ్ల నుండి ఉంది. అంతకు క్రితం ఎన్ని పార్టీలు, ఎందరు నేతలు ఆహ్వానించినా ఆయన స్పందించలేదు. వైకాపా ద్వారా రాజ్యసభలోకి ప్రవేశించాలని ప్రయత్నించారు. అందుకోసం జగన్ జైలుకు వెళ్లినప్పుడు రాజశేఖర్‌రెడ్డి మీద ఉన్న అభిమానంతో ఆయన పార్టీ ఖర్చు మొత్తం తానే భరించారు. అంతర్గత సమాచారం ప్రకారం ఆయన ఇప్పటికి వైయస్సార్‌సీపీకి దాదాపు 500కోట్ల వరకు ఖర్చుపెట్టారు. వాస్తవానికి ఈ అంకె చాలా తక్కువని, దానికి రెట్టింపు డబ్బును ఆయన జగన్ కోసం ఖర్చుచేసినట్లు చెబుతున్నారు. గత ఎన్నికల సమయంలో కూడా భారీ మొత్తాలు చేబదులుగా ఇచ్చారు.
అయితే జగన్ తత్వం తెలిసిందే. ఆయన మీ ఇంటికొస్తే ఏమిస్తారు? మా ఇంటికి వస్తే ఏమి తెస్తారు.. అనే టైప్. చేతిచమురు వదిలించుకోవడం తప్ప, అందుకు తగిన అభిమానం కూడా జగన్ నుండి ఆశించడం వృధా ప్రయాస అన్న నిజం ఆలస్యంగా అర్థమైంది వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి. దానితో విరక్తి చెందిన ఆయన రాజకీయాలు తన ఒంటికి సరిపడవని ఇంటి పట్టునే ఉండిపోయాడు. దాన్ని అవకాశంగా తీసుకొని తెలుగుదేశం అధినేతలు ఆయనకు వల విసిరారు. బంగారు బాతును చేజిక్కించుకున్నారు. ఇప్పటికిప్పుడు తనకు ఏ పదవీ కావాలని ప్రభాకర్‌రెడ్డి కోరలేదు. రేపటి ఎన్నికల వరకు ఎదురుచూసే ఓర్పు ఉందని చెప్పాడట. ఈ పెద్దమనసు గ్రహించిన చంద్రబాబు, ఆయనకు రాష్ట్ర పార్టీ నిర్వహణలో ఒక కీలకమైన బాధ్యతను అప్పచెప్పబోతున్నట్లు సమాచారం. నిస్వార్ధంగా పని చేస్తామని ముందుకొచ్చే వారు ఎంతో అరుదుగా తప్ప దొరకరు కదా..! వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి చేరిక పట్ల జిల్లా పార్టీలో స్వాగతించే వారు తప్ప అభ్యంతరాలు చెప్పేవారు ఎవరూ లేరు. ఆయనది వివాదరహిత జీవన శైలి కావడమే ఇందుకు కారణం, పదవుల కోసం ప్రాకులాట. పదవి వచ్చిన నాటి నుంచి ప్రజాధనం ఎలా ఆరగించాలా? అన్న యావ తప్ప ప్రజల కోసం ఆలోచించే రాజకీయవాడులే కరువైపోయిన కాలం ఇది. ఈ నేపధ్యంలో విపిఆర్ రాజకీయ రంగ ప్రవేశం అందరూ ఆహ్వానించే పరిణామం.