ఎమ్మెల్యేలు పార్టీ మారితేనే ప్రజాస్వామ్యం ఖూనీ అయినట్టా. నాయకులు మారితే మాత్రం సమర్ధనీయమా. ఈ డౌట్ ఆంధ్రులందరికీ వస్తోంది. సేవ్ డెమోక్రసీ పేరుతో వై.యస్.జగన్ చేస్తున్న హడావుడి ఆం.ప్ర. వీధుల నుండి దిల్లీ కి చేరింది. అక్కడ ప్రభుత్వపెద్దలను కలిసి చంద్రబాబుపై ఫిర్యాదు చేస్తారట. వైకాపా నుండి ఎమ్మెల్యేలు తెదేపాలోకి వెళుతున్నారు ఇది అప్రజాస్వామికం అని జగన్ ఆరోపణ. పోతే పోయారు తమ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే గిరికి రాజీనామా చేయాలనేది మరో డిమాండ్. రాజీనామా చేస్తే అమ్ముడు బోయినట్టు కాదని ఆయన ఉద్దేశం. మరోవైపు మా వాళ్ళు మగాళ్ళు అందుకే పార్టీ మారారు అని ఫైర్ బ్రాండ్ రోజా సర్టిఫికెట్ ఇచ్చింది.
అవినీతి డబ్బుతో చంద్రబాబు ఎమ్మెల్యేలని కొంటున్నారని జగన్ ఆవేదన. ఈ ఫిర్యాదుపై దిల్లీ పెద్దలు ఏవిధంగా స్పందిస్తారనేది చూడాలి. ఇప్పటి వరకు ప్రజాసమస్యలతో నిరసనలు, ధర్నాలు, నిరహార దీక్షలు చేసిన జగన్ ఇప్పుడు తన పార్టీని కాపాడుకోవడం కోసం ఉద్యమం చేయాల్సి వచ్చింది. ఇంతజరుగుతున్నా ఆయన తీరు మారడం లేదని కార్యకర్తలు వాపోతున్నారు.
పార్టీలు మారడం అంటే కేవలం ఎమ్మెల్యేలు మారితేనే దాన్ని ఫిరాయింపుగా భావించాలా. ఇతర హోదాలో ఉన్న నాయకులు జండా మారిస్తే దాన్నేమంటారో జగన్ చెప్పాలి. ఎందుకంటే రాజకీయ పునరావాసం కోసం కాంగ్రెస్, తెదేపాల నుండి అనేక మంది వైకాపాలో చేరారు. వారికి పార్టీ కండువకప్పి జగన్ స్వాగతించారు. ఇవి చేరికలే. భవిష్యత్తు ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ ఇస్తామనే హామీ వచ్చాకే చేరికలుంటాయనేది అందరికీ తెలిసిందే. ప్రతిరోజు పార్టీ వాయిస్ వినిపించే బొత్స, వాసిరెడ్డి, అంబటి వీరంతా ఇతర పార్టీల నుండి వచ్చినవారే కదా. నాడు పార్టీ బలం కోసం చేర్చుకున్నారు. ఇప్పుడు వెళ్లిపోతున్నవారిని చూసి భయపడతున్నారు. ఎన్నికల లోపు పార్టీ ఖాళీ అవుతుందనే భయం వైకాపా అగ్రనేతల్లో కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీలో చేరితే కొనేశారని, అలాంటివే తెలంగాణలో జరిగితే 'ఆపరేషన్ ఆకర్ష్' అని జగన్ మీడియా రెండు నాల్కల ధోరణితో రాతలు రాస్తోంది. ఆతని పత్రిక ఒక్కో స్టేట్ కు ఒకోరకమైన పాలసీ పెట్టుకున్నట్టు కనిపిస్తోంది.