ఈమధ్య వరకు పురచ్చితలైవి జయలలితకు.. ఆమె నిచ్చెలి శశికళకు ఉన్న బంధం, అనుబంధం అన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కానీ ఎవ్వరికీ తెలియని అంతర్గత విషయాల నేపథ్యంలో జయను శశికళ వదిలేసింది. కాగా ఇప్పుడు ఆ స్థానాన్ని ఆక్రమించాలని భారీ హీరోయిన్ నమిత టార్గెట్ చేస్తున్నట్లుగా కోలీవుడ్ మీడియా గుసగుసలాడుతోంది. వాస్తవానికి నమిత మొదట బిజెపిలో చేరాలని భావించింది. తనకు మోడీ అంటే చాలా ఇష్టమని, తనకు అవకాశం ఇస్తే బిజెపిలో చేరుతానని కూడా మీడియాముఖంగా చెప్పింది. కానీ ఉన్నట్లుండి ఆమె తన మనసును మార్చుకుంది. అన్నాడీఎంకేలో చేరింది. తిరుచ్చిలో జయలలిత సమక్షంలోనే ఆ పార్టీ సభ్యత్వం తీసుకుంది. నమితను చూసి జనాలు ఓట్లు వేయకపోవచ్చు కానీ ఆమె ప్రచారం చేస్తే మాత్రం జనాలు విపరీతంగా వస్తారు. సో... నమితను ఆ యాంగిల్‌లో వాడుకోవాలని జయ భావిస్తున్నట్లు సమాచారం. ఎలాగైనా జయకు మరింత సన్నిహితం అయి శశికళలా కింగ్ మేకర్ కావాలనే ఆలోచనలో నమిత ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. మరి నమిత కోరిక నెరవేరేనా! లేదా? అనేది వేచిచూడాల్సివుంది. మరోవైపు నిన్నటివరకు డీఎంకేలో ఉన్న ఖుష్భూ తాజాగా కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఇక మరో మాజీ నటి నగ్మా కూడా కాంగ్రెస్‌లోనే ఉంది. తమిళనాడు వరకు తీసుకుంటే ఇక్కడ జాతీయపార్టీలైన బిజెపి, కాంగ్రెస్‌లకు పట్టు తక్కువే. ఇక్కడ కేవలం ప్రాంతీయ పార్టీలదే హవా...! అయితే రాష్ట్రంలో కాకపోయినా కేంద్రంలో మాత్రం బిజెపి, కాంగ్రెస్‌ల మధ్యే పోటీ ఉంటుంది. కొందరు కాంగ్రెస్, బిజెపిల వైపు ఆసక్తి చూపించడానికి ఇదే అసలు కారణం అని వేరేగా చెప్పనక్కర్లేదు.