బాలకృష్ణ వందో సినిమా ఇటీవలే మొదలైంది. ఇక మిగిలింది చిరంజీవి 150వ సినిమానే. ఆ చిత్రానికి కూడా త్వరలోనే కొబ్బరికాయ కొట్టబోతున్నారని సమాచారం. ఈ నెల 29న అందుకు ముహూర్తంగా నిర్ణయించారని తెలిసింది. అయితే సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లేది మాత్రం ఎండలు తగ్గాకేనట. మే చివర్లో కానీ, జూన్ మొదటివారంలో కానీ చిత్రీకరణ మొదలుపెడదామని చిరు చెప్పారట. ఆ మేరకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి కత్తి రీమేక్‌లోనే నటించబోతున్న విషయం తెలిసిందే. ఆ కథని తెలుగు వాతావరణానికి తగ్గట్టుగా మార్చే ప్రయత్నాలు కొంతకాలంగా జరుగుతున్నాయి. మొదట కథలోని కొన్ని విషయాలపై చిరు సంతృప్తి చెందలేదట. అందుకే వినాయక్ మరిన్ని కసరత్తులు చేసి కథలో కీలకమైన మార్పులు చేశారని తెలిసింది. ఇటీవలే వినాయక్ ఫైనల్‌గా సెట్ చేసిన స్క్రిప్టుని తీసుకెళ్లి చిరంజీవికి చూపించారట. ఆయన స్క్రిప్టు మొత్తాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారట. అన్నీ కుదిరాయి కాబట్టి వెంటనే సినిమా మొదలుపెట్టాలనుకొన్నారు. అయితే చిరు మాత్రం 'ఎండలు మరీ విపరీతంగా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి పూజా కార్యక్రమాలతో సినిమాని లాంఛనంగా ప్రారంభిద్దాం, ఆ తర్వాతే షూటింగ్ మొదలెట్టేద్దాం' అని చెప్పారట. ఆలోపు మరిన్ని మార్పు చేర్పులు చేయమని వినాయక్‌కి సలహా ఇచ్చారట. సినిమాని నిర్మించనున్న చరణ్ ప్రస్తుతం ప్రారంభానికి సంబంధించిన పనుల్లో వుండగా, వినాయక్ మాత్రం స్క్రిప్టుతోనే కుస్తీలు పడుతున్నట్టు తెలుస్తోంది. చరణ్ తన తండ్రి 150వ సినిమా ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం. అయితే చిరు మాత్రం సినిమాని సాదాసీదాగానే మొదలెట్టాద్దామని, ఆడియో ఫంక్షన్ గ్రాండ్‌గా చేద్దామని చెబుతున్నాడట. కానీ చరణ్ మాత్రం 150వ సినిమా కాబట్టి గ్రాండ్‌గానే ప్రారంభిద్దామని పట్టుబడుతున్నాడని మెగా కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి.