మెగాస్టార్ చిరంజీవి నటించే కొత్త చిత్రానికి కదలిక వచ్చింది. చాలాకాలంగా ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి వెళుతున్న ప్రాజెక్ట్ ఇది. చివరికి కత్తి రీమేక్ చేయడానికే మొగ్గుచూపుతున్నారని సమాచారం. వినాయక్ దర్శకుడు. నిజానికి అఖిల్ లాంటి ఫ్లాప్ తీశాక వినాయక్ ను పక్కకి పెడతారని అంతా భావించారు. కానీ చిత్రంగా వినాయక్ నే కంటిన్యూ చేస్తున్నారు. గతంలో చిరంజీవికి ఠాగూర్, చరణ్ కు నాయక్ వంటి హిట్ సినిమాలు ఇవ్వడమే కారణం అని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. పైగా వినాయక్ చిరుకు వీరాభిమాని కావడం కూడా కారణం.
బాలకృష్ణ వందవ సినిమా మొదలయ్యాక చిరులో కదలిక వచ్చిందా, ఇంకా ఎక్కువకాలం నాన్చితే అభాసుపాలవుతామనే విమర్శలు వస్తాయనే అనుమానం కూడా ఉండడంతో చిరు చిత్రాన్ని ఇదే నెలలో ప్రారంభిస్తారని సమాచారం. ఈ నెల 29 తర్వాత మరో మూడు నెలల వరకు మంచి ముహూర్తాలు లేవంటున్నారు. ఇది కూడా ఓ కారణమే.
ఇంతకి చేయబోయే సినిమా చిరుకు 150 అవుతుందా... ఈ అనుమానం చాలా మందిలో ఉంది. గతంలో చిరంజీవి సినిమాల గురించి ప్రస్తావన వచ్చినపుడు 149 చిత్రాల్లో నటించిన చిరు మరొక సినిమా చేస్తే 150 అవుతుందని వేదికపై ఉన్న అమితాబ్ వ్యాఖ్యానించారు. కానీ గత ఏడైది బ్రూస్ లీ అనే సినిమాలో కొద్ది క్షణాలు కనిపించే పాత్ర చేశాడు కాబట్టి 150 సాంకేతికంగా సినిమా చేసినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఇది టీజర్ లాంటిదే అని చిరంజీవి ప్రకటించారు కాబట్టి లెక్కలోకి తీసుకోవద్దని చిరు సన్నిహితులు వాదిస్తున్నారు. గెస్ట్ పాత్రలు చేస్తే పరిగణించవద్దంటే ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే చిరు నటించిన 150 చిత్రాల్లో ఎనిమిది గెస్ట్ రోల్స్ చేసిన సినిమాలున్నాయి. వీటిని పక్కన పెడితే కథ మొదటికి వస్తుంది. అంకెల విషయం ఎందుకు చిరు కొత్త సినిమా చేయడం అంటే సంతోషకరమైన వార్తని అభిమానులు భావిస్తున్నారు. మెగా హీరోలందరూ సమృద్ధిగా ఉన్నపుడే మెగాస్టార్ మళ్లీ తెరంగేంట్రం చేయడం విశేషం.