'సరైనోడు' సినిమాలో విలన్ పాత్రధారి ముఖ్యమంత్రి ఒక్కగానొక్క కొడుకు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలు చేస్తుంటాడు. అతడిని ఎదుర్కోవడానికి హీరో వస్తాడు. ఆ తర్వాత షరా మామూలే. ఇది చదువుతుంటే విలన్ ని ఎవరినో ఉద్దేశించి తయారుచేసుకున్న క్యారక్టరని ఇట్టే తెలిసిపోతుంది. దివంగత ముఖ్యమంత్రి వై.యస్. ఏకైక తనయుడు జగన్ పై గత ప్రభుత్వ హయంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని క్విడ్ ప్రో కో పద్దతిన లబ్ది పొందాడని సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ పాయింట్ ప్రేరణతోనే అల్లు అర్జున్ నటించిన 'సరైనోడు' సినిమా కథని రాశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో జగన్ బలమైన శక్తిగా ఉన్నారు. ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేయడం కోసం అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2019 ఎన్నికల లోపు జగన్ కు చెక్ పెట్టగలిగితే లాభపడేదెవరో ఇట్టే అర్థమవుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిరంజీవికి లబ్ది చేకూర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బావ (చిరంజీవి) రాజకీయ బాగుకోసం బావమరిది ( అల్లు అరవింద్) చేస్తున్న ప్రయత్నాల్లో 'సరైనోడు' సినిమా ఒక అంకం అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిని వైకాపా నేతలు కూడా ధృవీకరిస్తున్నారు. సినిమా అనేది పవర్ ఫుల్ మీడియా కాబట్టి దానిద్వారా ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పై బురదజల్లే ప్రయత్నం జరుగుతోందని స్పష్టమవుతోంది. ఈ అనుమానం జగన్ అభిమానుల్లో కూడా ఉంది. సినిమాల్లో నేతలను విమర్శించడం కొత్తకానప్పటికీ ఇటీవల కాలంలో మాత్రం ఇది జరగలేదు. చిరంజీవికి రాజకీయ పునరావాసం కల్పించి తద్వారా బలవంతుడిని చేయాలని అల్లు అరవింద్ పాచికలు వేస్తున్నారు. ఇటీవల వైజాగ్ లో 'సరైనోడు' వేడుక కూడా అందులో భాగమే అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.