ఓ బడా తెలుగు హీరో సినిమా హిట్టయితే యాభై లేదా అరవై కోట్లు, ఫ్లాప్ అయితే ఏ పదో లేక ఇరవయ్యో కోట్లు వసూల్ చేయడం న్యాయంగా మనం వింటూనే ఉంటాం. అదేంటో, పవన్ కళ్యాణ్ చేసిన సర్దార్ గబ్బర్ సింగ్ మాత్రం ఫ్లాపు అన్న పదానికి కొత్త నిర్వచనం చెప్పినా, రిలీజయిన మొదటి రోజు నుండి చెత్త సినిమా అన్న టాక్ సంపాదించినా, మాకు ఫస్ట్ డే ఒక్కటి చాలు అన్నట్లుగా రికార్డుల మోత మోగించి 50 కోట్ల క్లబ్బులో ఎంచక్కా కూర్చుంది. మీ హీరో స్టామినా ఎంతా అంటే, ఇదిగో ఇంతా అంటూ ఫ్లాపయిన సినిమాను చూసి కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. సినిమా గొప్పో లేక చేతికి చిప్పో అన్న సంగతి అటుంచితే బాక్సాఫీస్ సబ్జెక్టు మీద మాత్రం ఖచ్చితంగా పవర్ స్టార్ నంబర్ 1 అన్నట్లుగా ట్రేడ్ వర్గాలు కూడా ఫిక్స్ అయిపోయాయి. ఓ అట్టర్ ఫ్లాప్ సినిమా మీదే 50 కొడితే, ఏకగ్రీవంగా హిట్ టాక్ సంపాదించే సినిమా పడితే పవన్ ఎక్కడిలో వెళ్ళిపోతాడు అన్నది నిశ్చయం. పవన్ బాబుతో నంబర్ 1 కోసం పోటీ పడుతున్న మహేష్ బాబుకు సర్దార్ పుణ్యమాని బ్రహ్మోత్సవానికి అగ్ని పరీక్ష ఎదురుకాబోతోంది. మే రెండో వారం లేదా మూడో వారంలో విడుదల అవుతున్న ఈ చిత్రం ఎంత కాదన్నా హిట్ టాక్ సంపాదిస్తే 100 కోట్లు, ఫ్లాప్ టాక్ మూట గట్టుకుంటే 50 కోట్లు షేర్ సాధించాల్సిందే. అప్పుడే ఇద్దరు స్టార్ హీరోల మధ్య పోటీ రసవత్తరంగా ఉంటుంది. శ్రీకాంత్ అడ్డాల సినిమాకు అంత సీన్ ఉంటుందా లేదా అన్నది తొందరలోనే తేలిపోతుంది!