ఇండస్ట్రీలో ప్రచారమయ్యే గాసిప్పులు అప్పుడప్పుడు కాస్త మంచిని కూడా చేస్తుంటాయి. అసలు విషయాన్ని వెలుగులోకి తీసుకురావడానికి కారణమవుతుంటాయి. కృష్ణగాడి వీర ప్రేమగాథ భామ మెహరీన్‌నే తీసుకోండి. ఈ ముద్దుగుమ్మ కొత్తగా ఏ చిత్రం ఒప్పుకొందో ఎవ్వరికీ తెలియదు. తొలి సినిమాతోనే సూపర్‌హిట్టు కొట్టి కొత్త కబురేదీ వినపించడం లేదే అని ఆమె వైపు అనుమానంగా చూశారంతా. మరికొద్దిమంది మాత్రం నాలుగైదు సినిమాలు ఒప్పుకొందని, వాటిలో కళ్యాణ్‌రామ్ సినిమా ఒకటి, రాజ్‌తరుణ్ సినిమా ఒకటి, ఇంకా ఇంకా అంటూ ప్రచారం చేశారు. దీంతో ఎక్కడికెళ్లినా మీరు ఫలానా సినిమాలో చేస్తున్నారట కదా అని అడగటం మొదలుపెట్టారట. రోజు రోజుకీ ఆ ప్రచారమే ఊపందుకోవడంతో మెహరీన్ స్పందించింది. అసలు విషయం వెలుగులోకి తీసుకొచ్చింది. తాను సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా బి.వి.ఎస్.రవి తెరకెక్కించనున్న సినిమాలో మాత్రమే నటించబోతున్నానని ఆమె స్పష్టం చేసింది. సాయిధరమ్ తేజ్, బి.వి.ఎస్.రవి కలయికలో సినిమా వుందని అందరికీ తెలుసు కానీ... అందులో మెహరీన్ కథానాయికగా నటిస్తోందన్న విషయం మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఆమెపై సాగుతున్న ప్రచారం మూలంగా అసలు విషయం వెలుగులోకి వచ్చిందన్నమాట. అన్నట్టు మెహరీన్ హిందీలో కూడా నటిస్తోంది. అక్కడ మోడలింగ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న మెహరీన్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ఓన్ ప్రొడక్షన్‌లో నటించేందుకు అంగీకరించింది. ఆ చిత్రం కూడా హిట్టయిందంటే ఇక కృష్ణగాడి భామ బాలీవుడ్‌లోనే బిజీ అవుతుందేమో!