ఇక్కడి రెండు తెలుగు రాష్ట్రాలను మించి అమెరికాలోని వసూళ్ళ మీదే చానా తెలుగు సినిమాల భవితవ్యాలు ఇప్పుడు ఆధారపడి ఉంటున్నాయి. అందుకే ఇబ్బడిముబ్బడిగా ఓ అంచనా అంటూ లేకుండా ప్రతి వారం ఏదో ఓ తెలుగు సినిమా ఇక్కడతో పాటుగా అక్కడ అమెరికాలో కూడా రిలీజ్ అవుతోంది. స్టార్ హీరోలకు ఎలాగో కొద్దో గొప్పో గిరాకీ ఉంటుంది. ఒకసారి మౌత్ టాక్ బయటపడ్డాక ఎవరికైనా తప్పించుకోవడం కష్టం. కానీ కుర్ర హీరో రాజ్ తరుణ్ మాత్రం కుమారి 21 F, ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావా లాంటి సినిమాలతో ఇక్కడే కాకుండా అక్కడ అమెరికాలో కూడా కొంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఆ ఆధారంతోనే మొన్న విడుదలయిన ఈడో రకం ఆడో రకం సినిమాను అమెరికాలో కూడా వదిలారు. మీడియా మొత్తంగా కట్టగట్టుకొని ఈ అడల్ట్ సినిమాను ఆకాశానికి ఎత్తేసి ఆహా ఓహో అన్నా, మాది సూపర్ కామెడీ సినిమా చూడండి బాబోయ్ అని అదో రకంగా తెగ పబ్లిసిటీ చేసినా అక్కడ పట్టించుకున్న నాధుడు లేకుండా పోయాడు. నిజానికి మంచు విష్ణు సినిమాలంటేనే అక్కడ మార్కెట్ శూన్యం. కనీసం రాజ్ తరుణ్ పేరు మీదైనా కొన్ని టిక్కెట్లు చిరుగుతాయి అనుకుంటే ప్లాన్ బెడిసికొట్టింది. వారాంతం నాటికి ఈడో రకం ఆడో రకం అక్కడ వసూల్ చేసిన మొత్తం అక్షరాలా 9 లక్షలంటే వినటానికి కాస్త ఇబ్బందిగానే ఉంది మరి. తన సినిమాలేవో చేసుకోక, ఇలా కొత్త దారి తొక్కిన రాజ్ తరుణ్ బాబుకి గట్టి దెబ్బే పడింది. సర్దార్ దెబ్బకి జనాలు మొత్తం మా వైపే తిరుగుతారు అని అనుకోవడం పొరబాటు అయింది. లెక్క ఏమిటంటే, ఓ సినిమా బాలేదు కదాని రెండో సినిమాకి పోలోమని జనాలు వచ్చేయరు. రెండోది కూడా బాగుందని టాక్ వస్తేనే ప్రేక్షకానుగ్రహం!