సాధారణంగా చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత మీడియాపై ఉంది. ఎక్కడ పైరసీ జరిగినా మీడియా వారు అక్కడ వాలిపోయి ఆ బండారాలను బయటపెడుతుంటారు. కానీ ఓ చానెల్ ప్రతినిధులే ఓ సినిమాను పైరసీ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. విషయానికి వస్తే విజయ్ నటించిన 'తేరీ' చిత్రం ఏప్రిల్ 14న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోయంబత్తూరులోని శాంతి ధియేటర్‌లో ఆడుతోంది. కాగా తమిళ చానెల్ 'పోలీమర్'కు చెందిన ఓ కెమెరామెన్ ఈ థియేటర్‌లో సినిమాను తన కెమెరాతో చిత్రీకరిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ థియేటర్‌లో ఓ వ్యక్తి కెమెరాతో తిరుగుతున్న విషయాన్ని హాల్‌లోని విజయ్ ఫ్యాన్స్ గమనించి ఆ కెమెరామెన్ దగ్గరకు వెళ్లి కెమెరాతో షూట్ చేయడం ఆపాలని కోరారు. దానికి ఆ కెమెరామెన్ ఒప్పుకోకుండా చిత్రాన్ని చిత్రీకరిస్తూనే ఉండటంతో విజయ్ ఫ్యాన్స్ ఆ కెమెరామెన్‌ని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేయించారు. కాగా తమిళనాడులో 'పోలీమర్' టీవీ చానెల్‌కు చాలా చెడ్డపేరు ఉంది. పంచాయతీలు చేయడంతో పాటు ఇప్పటివరకు వారు అనేక చిత్రాలను పైరసీ చేశారని, కానీ ఇప్పటివరకు వారు తప్పించుకున్నారని, కానీ ఎట్టకేలకు 'తేరీ' చిత్రం షూట్ చేస్తూ దొరికి పోయారని కోలీవుడ్ మీడియాతో పాటు విజయ్ ఫ్యాన్స్, పోలీసులు దృవీకరిస్తున్నారు. ఇలాంటి వారి వల్లే జర్నలిజానికి చెడ్డ పేరు వస్తోందని వారు వాపోతున్నారు.