లాభాలొస్తే మావి నష్టాలొస్తే మీవి ఇది నిర్మాత తీరు. నష్టాలొస్తే మీరు షేర్ చేసుకోవాలి ఇది బయ్యర్ల మాట. రజనీకాంత్ ఏ ముహూర్తాన తన బాబా సినిమా ద్వారా నష్టపోయిన బయ్యర్లకు నష్టపరిహారం తిరిగిచ్చాడో కానీ దాని ప్రభావం తాజాగా లోఫర్ సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్ పై కనిపించింది. కమర్షియల్ గా పూరి జగన్నాథ్ సినిమా బయ్యర్లు ఎగేసి కొంటారు. కొని లాభాలు తెచ్చుకున్నవారున్నారు. కానీ వరుణ్ తేజ్ నటించగా, సి.కల్యాణ్ నిర్మించిన లోఫర్ సినిమా కొని నష్టపోయిన బయ్యర్లు ఏకంగా పూరిపైనే దాడిచేశారు. కుటుంబసభ్యులను బెదిరించారు. ఈ పరిణామం ఎవరూ ఊహించనిది. నష్టం వస్తే దర్శకుడు చెల్లించాలనేది కొత్తవాదన. చిత్ర నిర్మాత సి.కల్యాణ్ తెరవెనుక ఉండి ఇది నడిపిస్తున్నాడా అనే అనుమానం కూడా ఉంది. సినిమా అనేది జూదం లాంటిందే. ప్రతిసారి డబ్బు వస్తుందని గ్యారంటీ లేదు. ఈ విషయం బయ్యర్లకు తెలియంది కాదు. పదుల సంఖ్యలో సినిమాలు పంపిణీ చేసిన బయ్యర్లే భౌతికదాడికి దిగడం చిత్ర పరిశ్రమలో ఆందోళన కలిగిస్తోంది.
మెగా కంపౌండ్ హీరో వరుణ్ తేజ్ నటించిన మూడవ చిత్రానికే ఇలాంటి విపత్కర పరిస్థితి వచ్చింది. అదే కంపౌండ్ కు చెందిన రామ్ చరణ్ తుఫాన్ (జంజీర్), బ్రూస్ లీ, పవన్ కల్యాణ్ సర్దార్... సినిమాల బయ్యర్లు సైతం తీవ్రంగా నష్టపోయారు.ఆ నష్టపోయిన మెుత్తాన్నితిరిగి ఇవ్వాలని వారు డిమాండ్ చేయలేదు.
లోఫర్ సినిమా రిలీజైన నాలుగు నెలల తర్వాత బయ్యర్లు చిత్ర దర్శకుడిపై దాడులు చేసే వరకు వెళ్ళారంటే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ పరిణామం గురించి పరిశ్రమ పెద్దలు ఆలోచించాల్సిందే.
Advertisement
CJ Advs