వాస్తవానికి సమంత సినీ జీవితంలోనే కాదు.. బయట కూడా పెద్ద రెబెల్. ఆమధ్య '1' (నేనొక్కడినే), 'సికిందర్' చిత్రాల సమయంలో ఆమె చాలా ఘాటు విమర్శలు చేసింది. హీరోయిన్ల అందాలను చూపించడం తప్ప సినీ ఇండస్ట్రీలో హీరోలకు ఇచ్చే ప్రాధాన్యం హీరోయిన్లకు ఇవ్వరని, పోస్టర్లలో కూడా హీరోయిన్లకు స్ధానం ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ స్టేట్‌మెంట్ చూసి కొందరు ఆగ్రహిస్తే, మరికొందరు మాత్రం ఆమె ఆవేదనను అర్థం చేసుకున్నారు. అలా అర్థం చేసుకున్న వారిలో త్రివిక్రమ్ ఒకడు. ఆమె కామెంట్స్ ఆయనకు ముల్లుగా గుచ్చుకున్నాయోమో కానీ తన తాజా చిత్రం 'అ..ఆ'తో ఆమె కోరికను తీర్చాడు త్రివిక్రమ్. ఈచిత్రం ఫస్ట్‌లుక్‌లో కూడా సమంతను ఎదురుగా చూపించి, నితిన్‌ని మాత్రం వీపు చూపించాడు. ఇక తాజాగా విడుదలైన టీజర్‌లో అయితే పూర్తిగా సమంతకే ప్రాధాన్యం ఇచ్చాడు. డైలాగులు కూడా సమంత చేతనే చెప్పించేట్లు టీజర్‌ను కట్ చేశాడు. 45సెకన్లు ఉన్న ఈ టీజర్‌లో 30సెకన్లు కేవలం సమంతకే కేటాయించాడు త్రివిక్రమ్. మొత్తానికి హీరోయిన్లకు కూడా హీరోలతో సమానంగా సమానత్వం ఉండాలని కోరుకుంటున్న సమంత కోరికను ఈ రూపంలో తీర్చివేశాడు. టీజర్‌ను కేరాఫ్ సమంతగా మార్చివేశాడు. మరి ఈ విషయంలో నితిన్ స్పందన ఏమిటో తెలియాల్సివుంది...!