ఇద్దరు హీరోలు కలిసి నటించినంత మాత్రానా అది మల్టీస్టారర్ సినిమా అనిపించుకోదు. స్టార్స్ అంటే ప్రత్యేక ఇమేజ్, సొంతంగా మార్కెట్, ఓపనింగ్స్ తేగల సత్తా, ప్రేక్షకులను ప్రభావితం చేయగల ఛరిష్మా ఇవన్నీ ఉండాలి. అప్పుడే వారిని స్టార్స్ అంటారు. అలాంటి స్టార్స్ కలిసి నటిస్తేనే వాటిని మల్టీస్టారర్ అంటారు. అంతేకానీ ఇద్దరు హీరోలు కలిసి నటించినంత మాత్రానా అవి మల్టీస్టారర్స్ కావు. ఈ విషయం ఈడోరకం-ఆడోరకం యూనిట్ కు తెలియనట్టుంది. ఇందులో విష్ణు, రాజ్ తరుణ్ హీరోలు. విష్ణు ఇప్పటికే ఫ్లాఫ్ ల పరంపరలో ఉన్నారు. అతడు నటించిన సినిమాలకు బిజినెస్ జరగడమే కష్టంగా మారింది. ఓపనింగ్స్ సంగతి దేవుడెరుగు. ఇక రాజ్ తరుణ్ నటించింది నాలుగు చిత్రాలే. హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నంలోనే ఉన్నాడు. వీరిద్దరు కలిసి నటించిన చిత్రాన్ని ఇద్దరు హీరోల సినిమాగా మాత్రమే చూడాలి కానీ, పెద్దపెద్ద మాటలు మాట్లాడకూడదు. ముఖ్యంగా మల్టీస్టారర్ అని ఎట్టి పరిస్తితుల్లో అనకూడదని సీనియర్ నిర్మాతలు అంటున్నారు. అలా అంటే స్టార్ హీరోలను అవమానించినట్టే అవుతుంది. విషయం తెలియక చిత్ర దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి మల్టీస్టారర్ అని అనడమే కాకుండా ఎన్టీఆర్, ఎఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు ఇంకా వెంకటేశ్, మహేష్ బాబు కలిసి నటించిన కాంబినేషన్స్ తో పోల్చారు. ఈ మాటలు వినడానికే ఇబ్బందిగా ఉన్నాయి. జి.నాగేశ్వరరెడ్డి ఇప్పటికైనా వాస్తవం గ్రహిస్తే మంచిది.