కాకతాళీయమో లేక ఉద్దేశ్యపూర్వకంగానో చెప్పలేం గానీ సూపర్‌హిట్ కాంబినేషన్ బాలకృష్ణ-బోయపాటిల మధ్య చిరు చిచ్చుపెట్టాడని అర్దం అవుతోంది. ఇటీవల జరిగిన 'సరైనోడు' ఆడియో విజయోత్సవాన్ని వైజాగ్‌లో గ్రాండ్‌గా జరిపిన సంగతి తెలిసిందే. కాగా ఈవేడుకలో చిరు మాట్లాడుతూ.. బోయపాటి తన వల్లే 'సింహా, లెజెండ్' వంటి విజయాలను కొట్టాడని, వాటి కథలను తన దగ్గరకు బోయపాటి తెచ్చినప్పుడు తాను ఆ కథలకు మార్పులు చేర్పులు చెప్పానని, అలా మార్పులు చేసిన మూలంగానే ఆయా చిత్రాలు విజయం సాధించాయనే అర్దం వచ్చేలా మాట్లాడాడు. వాస్తవానికి బోయపాటి శ్రీనును నందమూరి అభిమానులు విపరీతంగా ఆదరిస్తారు. బాలయ్య 100వ చిత్రం బోయపాటితోనే చేయాలనేంతగా అనుబంధం వారిమధ్య ఏర్పడింది. ఎప్పుడైతే చిరు ఈ విధంగా మాట్లాడే సరికి నందమూరి అభిమానులే కాదు.. బోయపాటి కూడా విస్తుపోవడం జరిగిందని తెలుస్తోంది. ఇక తాజాగా చిరు గురించిన మరో వార్త కూడా ఫిల్మ్‌నగర్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ వేడుకలో చిరంజీవి మొహంలో నవ్వులేదని, ఏదో యాంత్రికంగా మాట్లాడాడని అంటున్నారు. చరణ్‌ను మించిన స్ధాయిలో బన్నీ ఫాలోయింగ్ పెరగడం, తాజాగా తాము చేసిన 'బ్రూస్‌లీ, సర్దార్ గబ్బర్‌సింగ్'లు డిజాస్టర్లగా మిగలడాన్ని చిరు జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. అంతేకాక ఇటీవల చరణ్ కోసం కొన్నిస్టోరీలను తయారుచేసుకున్న పలువురు డైరెక్టర్లు మెగా కాంపౌండ్ చెప్పే మార్పులు చేర్పులు.. బాగా తిప్పించుకోవడం చూసి బన్నీ తలుపుతడుతున్నారని అంటున్నారు. 'సన్నాఫ్ సత్యమూర్తి' కధను మొదట త్రివిక్రమ్ చరణ్ కోసమే తయారుచేశాడని, కానీ మెగా కాంపౌండ్ పెట్టిన కండీషన్స్ అన్నీ విని చివరకు బన్నీ వద్దకు వెళ్లాడని, అలాగే 'సరైనోడు'తో పాటు విక్రమ్ కె.కుమార్ చేయబోయే చిత్రం కథ కూడా చరణ్ చేత నో చెప్పించిన తర్వాతనే బన్నీ వద్దకు వెళ్లిందని సమాచారం. అయినా ఎవరి తలరాతకు ఎవరు బాద్యులు అంటూ కొందరు నిట్టూరుస్తున్నారు.