తమిళనాట సినిమావారికి, రాజకీయనాయకులకు మంచి అనుబంధం ఉంది. అలాగే తమకు నచ్చని హీరోల విషయంలో అక్కడి ప్రభుత్వాలు క్షక్ష్యసాధింపు చర్యలకు దిగుతుంటారు. అది కరుణానిధి కావచ్చు... లేక జయలలిత కావచ్చు. ముఖ్యంగా తనను విమర్శించిన వారిని అమ్మ జయలలిత నానా ఇబ్బందులు పెడుతుంది. అది ఇప్పటికే కమల్‌హాసన్, విజయ్‌ల విషయంలో నిరూపితం అయింది. వారిద్దరి సినిమాలను విడుదల విషయం నుండి అన్ని విషయాల్లో జయలలిత నానా ఇబ్బందులకు గురిచేసింది. తాజాగా మరోసారి ఆమె కన్ను విజయ్ నటిస్తున్న తాజా చిత్రం 'తేరీ'పై పడింది. వాస్తవానికి ఏ నిర్మాత అయినా కోరుకుంటే తమ చిత్రాల విడుదల సందర్బంగా మొదటి వారం, ఇంకా అవకాశం ఉంటే మరో వారం టిక్కెట్ల రేట్లను పెంచుకోవడం అక్కడ సర్వసాధారణం. ఇక విషయానికి వస్తే.. స్టార్ హీరో విజయ్‌కి సమస్యలు ఇప్పుడే తీరేలా కనిపించడం లేదు. 'తేరీ' చిత్రం రేపు విడుదలకు సిద్దమవుతోంది. కానీ ఎక్కడ లేని సమస్యలను జయలలిత విజయ్‌కు సృష్టిస్తోంది. ఈ చిత్రం రిలీజ్‌డేట్ అనౌన్స్ చేసినప్పటి నుండి ఈ సమస్యలు మరింత ఎక్కువయ్యాయి.
గత రెండు రోజులుగా ఈ చిత్రాన్ని మరో సమస్య చుట్టుముట్టింది. తమిళనాడు ప్రభుత్వం అన్ని థియేటర్ల యాజమాన్యాలకు టిక్కెట్ రేటు అధికధరకు అమ్మరాదని, నామినల్ రేట్లకే అమ్మాలని హుకుం జారీ చేసింది. పెంచి అమ్మితే ఊరుకునేది లేదని, జైలుకు వెళ్లాల్సివస్తుందని ఆదేశాలు జారీ చేసింది. ఈ వార్నింగ్‌తో బయ్యర్లు, ఎగ్జిబిటర్లు ఒక్కసారిగా బిత్తరపోయారు. 'తేరీ' చిత్రాన్ని భారీ రేట్లకు కొన్నామని, తాము తమ పెట్టుబడి వెనక్కి రప్పించుకోవాలంటే మినిమం టికెట్ రూ.500లకు అమ్మితే గానీ తమకు గిట్టుబాటు కాదని, అంతగా అయితే తమ థియేటర్లలో సినిమా రిలీజ్ చేయకుండా ఉండటమే మేలనే నిర్ణయానికి వచ్చేశారు. ముఖ్యంగా చెన్నై, మధురై, కోయంబత్తూరు ఏరియల్లో ఈ విషయాన్ని థియేటర్స్ బయట నోటీసుగా అంటించారు. తాము ఈ సినిమాను ప్రదర్శించడం లేదని థియేటర్ల ఓనర్స్ తెగేసి చెబుతున్నారు. ఈ విషయమై నిర్మాత థానుతో మాట్లాడేందుకు మీడియా ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఈ సమస్య వల్లనే విజయ్ తల పట్టుకొన్నాడని, ప్రమోషన్ కార్యక్రమాలకు కూడా రావడం లేదని అంటున్నారు. తెలుగులో ఎల్లుండి విడుదల కానున్న ఈ చిత్రం డబ్బింగ్ వెర్షన్ 'పోలీసోడు' ప్రెస్‌మీట్‌కు వస్తానని చెప్పినప్పటికీ ఈ సమస్య వల్లే ఆయన రాలేదని తెలుస్తోంది. ఇది చూసిన వారందరూ అయ్యో...పాపం విజయ్ అంటున్నారు. మరి ఈ వివాదం ఎలా ముగుస్తుందో వేచిచూడాల్సివుంది....!