అక్కినేని నాగార్జున సైకిలెక్కేశారు. ఇది ఎవరూ ఊహించనిదే అయినప్పటికీ నిజం. మంగళవారం అన్నపూర్ణ స్టూడియోలోనే ఇది జరిగింది. రాజకీయ పార్టీలకు దూరంగా ఉండే నాగ్ సైకిలెక్కాడంటే అది మీడియాను ఆకర్షించే వార్తే. జాతీయ మీడియా సైతం దీనికి ప్రాధాన్యత నిస్తుంది. పైగా గతంలో చంద్రబాబుకు నాగ్ సన్నిహితుడు కూడా. అలాంటి నాగార్జున సైకిలెక్కడం విశేషం కాకపోవచ్చు. కానీ జరిగింది వేరు.
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భరత్ ఠాగూర్ నేతృత్వంలో సభ్యులు సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ యాత్రను జండా ఊపి లాంచనంగా ప్రారంభించారు నాగార్జున. దీనికంటే ముందు యాత్ర సభ్యులు ప్రయాణించే సైకిల్ ఎక్కి కొద్దిసేపు తొక్కారు. ఈ సందర్భంగా మీడియా ఫోటోగ్రాఫర్లు పోటీలు పడి ఫోటోలు తీశారు. ఇదండి సంగతి.
చిరంజీవి కాంగ్రెస్ లో, బాలకృష్ణ టిడిపిలో, పవన్ కల్యాణ్ జనసేన పార్టీలో ఉన్నారు. ఇది పార్టీలు మారుతున్న సీజన్. ఎవరు ఎలాంటి నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారో తెలియని రోజులివి. అందువల్ల నాగార్జున వంటి హీరో భవిష్యత్తులో రాజకీయ ప్రవేశం చేస్తే ఆశ్చర్యపోవాల్సింది ఏమీ ఉండదు.