'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాని 'బాహుబలి' స్థాయిలో తీస్తానని క్రిష్ ఇటీవల ఓ వ్యాఖ్య చేశారు. దాని గురించి ఇండస్ట్రీలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాహుబలి స్థాయి ఏంటి? క్రిష్ ఆ సినిమాతో తన సినిమాని పోలుస్తూ చెప్పడమేంటి? అసలు బాహుబలి పేరెత్తాక ఆ అంచనాలు ఎలా ఉంటాయో క్రిష్ ఊహించాడా? అంటూ చర్చ కొనసాగిస్తున్నారు. కానీ క్రిష్ మాత్రం తన ప్రాజెక్టుపైనా, దాన్ని తీసే విధానంపైనా చాలా నమ్మకంగా ఉన్నాడు. క్రిష్ తక్కువ బడ్జెట్టుతోనే రంగంలోకి దిగుతుండొచ్చు. మహా.. అంటే ఆ సినిమాకి యాభైకోట్ల కంటే ఎక్కవ బడ్జెట్టుతో తీయలేకపోవచ్చు. కానీ బాహుబలి అంత ఎఫెక్ట్ రావడానికి తనకి ఆ మాత్రం బడ్జెట్టు చాలంటున్నాడు. క్రిష్ ఈ రకమైన కాన్ఫిడెన్స్‌తో ఉన్నందుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. కానీ ఆయన ఏదో బాహుబలితో పోల్చి తన సినిమాకి హైప్ తీసుకొచ్చే ఉద్దేశంతో ఆ మాట చెబుతున్నట్టు లేదు. నిజంగానే ఆ సినిమాని తన కళ్లతో చూశాడాయన. ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలో తెలిసిన దర్శకుడు క్రిష్. తన మొదటి సినిమా నుంచి ప్రతి చిత్రానికీ దర్శకత్వంతో పాటు నిర్మాతగా భారం కూడా మోస్తున్నాడు. ఆ అనుభంతోనే క్రిష్ బాహుబలి క్వాలిటీతో తన సినిమాని తీస్తానని చెబుతున్నాడు.
నిజానికి క్రిష్ కంచె తీస్తున్నప్పుడు కూడా ఆ కథ, కాన్వాస్‌ని గుర్తుకు తెచ్చుకొని అసలు వరుణ్‌తేజ్‌లాంటి ఓ కొత్త కథానాయకుడితో అంత భారీ కాన్వాస్ ఉన్న కథని తెరకెక్కించవచ్చా? హీరో ఎంపికలోనే క్రిష్ పప్పులో కాలేశాడు, ఆ సినిమా బడ్జెట్టు కచ్చితంగా పరిధి దాటుతుందని మాట్లాడుకున్నారు సినీ జనాలు. కానీ క్రిష్ మాత్రం అంత పెద్ద కాన్వాస్ ఉన్న సినిమా అయినా... దాన్ని పరిమిత వ్యయంతోనే తెరకెక్కించాడు. జార్జియాలాంటి దేశానికి వెళ్లి రియల్ ఆయుధాలతోనూ, రియల్ లొకేషన్లలోనూ సినిమా తీసినా బడ్జెట్టుని మాత్రం పరిధి దాటనీయలేదు. దీన్నిబట్టి ఆయన నిర్మాణ దక్షత ఎలాంటిదో, దర్శకుడిగా ఆయన ఏ స్థాయిలో పక్కా ప్రణాళికతో అడుగు వేస్తాడో అర్థం చేసుకోవచ్చు. ఆ అనుభవాన్నంతా ఇప్పుడు బాలయ్యతో తీస్తున్న వందో చిత్రానికి ఉపయోగించబోతున్నాడు క్రిష్. నిజంగా ఆయన తెలుగు ఇండస్ట్రీకి మరో 'బాహుబలి'ని అందిస్తానడంలో ఎలాంటి సందేహం లేదు.