ఆంధ్రప్రదేశ్ లో తెలుగు చిత్రపరిశ్రమ డెవలప్ మెంట్ లో భాగంగా సినీ ప్రముఖుల్లో ఒకరికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చే ప్రయత్నాలను తెలుగుదేశం పార్టీ ప్రారంభించిందని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబుకు చాలామంది సినీ ప్రముఖులు సన్నిహితులే. రంగుల ప్రపంచం మద్దతు ఆయనకే ఉంది. గతంలో కూడా తెదేపా నుండి జయప్రద, మోహన్ బాబు రాజ్యసభకు వెళ్ళారు. ఈసారి జూన్ లో ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభకు మూడు ఖాళీలు వస్తాయి. వీటిలో ఒకటి సినిమా వాళ్ళకి ఇవ్వాలనే డిమాండ్ పార్టీలో ఉందని అంటున్నారు. ఆం.ప్ర.కు సినీ పరిశ్రమను ఆహ్వానిస్తున్నాం కాబట్టి సినీరంగంలో బాగా పట్టున్న ఎవరినైనా రాజ్యసభకు పంపిస్తే బావుంటుందని పలువురు మంత్రులు సైతం భావిస్తున్నారట. ఎన్నికల ఖర్చు ఉండదు. నేరుగా ఎంపికయ్యే అవకాశం ఉంది కాబట్టి దీనిపై పలువురు నిర్మాతలు ముచ్చటపడతున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. వారిలో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన డి.సురేష్ బాబు, కె.ఎస్ .రామారావు, కె.ఎల్. నారాయణ వీరితో పాటు ఇటీవలే పార్టీలో చేరిన జయసుధ కూడా ప్రయత్నాలు ప్రారంభించారట. రాజ్యసభ సభ్యత్వం అవకాశం ఎవరి తలుపుతట్టుతుందో అని ఎదురుచూస్తున్నారు. సురేష్ బాబు ఇప్పటికే వైజాగ్ లో స్టూడియో కట్టారు. ఇటీవలే కె.ఎస్.రామారావు వైజాగ్ లో ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ నిర్మాణాన్ని ప్రారంభించారు. కె.ఎల్. నారాయణకు బిల్డర్ గా మంచి పేరుంది. నటి జయసుధ పార్టీకి సినీ గ్లామర్ తెచ్చానంటోంది. వీరే కాకుండా మరికొందరు కూడా తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి బాబు మనసులో ఏముందో బయటకు రాలేదు.