సర్దార్... రాకకు అంతా సిద్దమైంది. ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి హడావుడి మెుదలెట్టి కొనసాగిస్తున్నారు. హైప్ క్రియేట్ చేయడానికి మీడియాను బాగా ఉపయోగించుకుంటున్నారు. సర్దార్... ప్రదర్శించే స్క్రీన్స్ సంఖ్య ఎంతనే విషయాన్ని నిర్మాత ఇంకా స్పష్టంచేయలేదు. హైదరాబాద్ లో అడ్వాన్స్ బుకింగ్ ఆశించినస్థాయిలో లేదని అంటున్నారు. మెుదటి మూడు రోజులకు ఢోకాలేదు. తర్వాత పరిస్థితి ఏమిటనేది మాత్రం సినిమా రిజల్ట్ తో తేలుతుంది. పవన్ కల్యాణ్ సినిమా అంటే భారీ ఓపనింగ్స్ గ్యారంటీ. కానీ సర్దార్... ను ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసే చిత్రంగా మలచాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. బాహుబలి రికార్డ్ క్రియేట్ చేయాలని చిరంజీవి ఆకాంక్షించారు. షోలే లాగా లాంగ్ రన్ ప్రదర్శింపబడాలని కూడా ఆయన ఆశించారు. అన్న కోరిక కోసమో లేదో కానీ సర్దార్...సూపర్ సక్సెస్ కావడం ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కు చాలా అవసరం. హీరోగా, రాజకీయంగా ఆయన ఇమేజ్ కొనసాగాలంటే సర్దార్... క్రియేట్ చేసే రికార్డులు ఉపయోగపడతాయి.
సర్దార్ .... సినిమా ప్రత్యేకతల గురించి రిలీజ్ ముందు మీడియాకు చెప్పడం ప్రచారంలో ఒక భాగం. అయితే దర్శకుడు బాబీ మినహా హీరో, నిర్మాత ఇప్పటి వరకు నోరువిప్పలేదు. పాటల చిత్రీకరణ పూర్తిచేసుకుని వచ్చిన పవన్ హైదరాబాద్ లోనే ఉన్నారు. నిర్మాత పబ్లిసిటి వ్యవహారాలు చూస్తున్నారు. నిర్మాణ భాగస్వామి ఈరోస్ బాలీవుడ్, విదేశాల మార్కెట్ బిజినెస్ చూస్తోంది. అందరూ బిజీగా ఉన్న కారణంగా టీవీ, ప్రింట్ మీడియా ప్రకటనలపై ఆధారపడ్డారనుకోవచ్చు.
బాహుబలిని టార్గెట్ చేసుకుని హైప్ చేయడం అభినందనీయమే. అయితే బాహుబలికి రాజమౌళి, ప్రభాస్ వంటి స్టార్స్ ఉంటే, సర్దార్... కు కేవలం పవన్ మాత్రమే ఉన్నారు. మరోవైపు ప్రతిసారి పవన్ ను పోలీస్ డ్రస్ లో చూసి బోర్ కొడుతుందనే విమర్శలు వచ్చిన నేపథ్యంలో పాటల స్టిల్స్ విడుదల చేశారు. సంగీత పరంగా ఎలాంటి ఆదరణ చూరగొన్నదనే విషయాన్ని యూనిట్ వర్గాలు వెల్లడించలేదు. మంచి ఎండల్లో వస్తున్న సర్దార్... ఎన్ని సంచలనాలకు వేదికవుతాడనేది చూడాలి!