రాజారవీంద్ర... సినిమా రంగంలో ఓ మంచి గుర్తింపును తెచ్చుకున్న ఆర్టిస్ట్ . ఒకప్పుడు విలన్ పాత్రలు, టీవీ సీరియల్స్‌లో నటిస్తూ.. పలువురు హీరోలకు పిఎగా పనిచేశాడు. కానీ ఈమధ్య ఆయనకు అవకాశాలు బాగా తగ్గాయి. అయితే తాజాగా 'ఊపిరి' విషయంలో రాజారవీంద్ర పేరు కొత్తగా వినిపిస్తుంది. 'ఊపిరి' అనే టైటిల్‌ను రాజారవీంద్ర ఎప్పుడో రిజిష్టర్ చేయించుకున్నాడట. కాగా పివిపి సంస్థ వంశీపైడిపల్లి దర్శకత్వంలో నాగ్-కార్తీల కాంబినేషన్‌లో తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన చిత్రానికి 'ఊపిరి' అనే టైటిల్ అయితే బాగా సరిపోతుందని భావించి రాజారవీంద్రను సంప్రదించారట. ఈ టైటిల్ తమకు ఇస్తే ఈ చిత్రంలో ఓ మంచి క్యారెక్టర్ ఇస్తామని ప్రమాణం చేయడంతో తనకు రెండు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో మంచి అవకాశం వస్తుందని భావించిన రాజారవీంద్ర ఎలాంటి డబ్బు తీసుకోకుండా ఆ టైటిల్‌ను పివిపికి ఇచ్చాడని తెలుస్తోంది. అనుకున్నట్టుగానే ఈ చిత్రంలో ఆయనకు పోలీస్ ఆఫీసర్‌గా ఓ పాత్రను ఇచ్చారు. కానీ ఎడిట్ చేసిన తర్వాత చూసుకుంటే అందులో తన పాత్ర కేవలం ఒకే సీన్‌లో ఒక డైలాగ్ మాత్రమే ఉన్న పాత్ర కావడంతో ఆయన తాను మోసపోయానని పివిపి సంస్థపై గుర్రుగా ఉన్నాడని తెలుస్తోంది. వాస్తవానికి టాలీవుడ్‌లో కేవలం తన మాయమాటలతో బతికేస్తున్న రాజారవీంద్రకే టోపీ పెట్టిన పివిపి సంస్థను కొందరు మంచి పనిచేశారని పొడుగుతుంటే.. రాజారవీంద్ర సన్నిహతులు మాత్రం రాజాకు అన్యాయం జరిగిందని బాధపడుతున్నారట .