రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పాడ్డాక చిత్రపరిశ్రమ ఎక్కడ ఉంటుంది అనే దానిపై అనుమానాలు తలెత్తాయి. హైదరాబాద్ కేంద్రంగానే ఇప్పటి వరకు ఉన్న పరిశ్రమ ఇక్కడే కొనసాగేలా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పటికే ముగ్గురు మంత్రులతో కమిటీ వేశారు. దీనికి పలువురు సినీ ప్రముఖులు అనేక ప్రతిపాదనలు చేస్తే ఇటీవలే ఐదుషోలు, చిన్న సినిమాల స్క్రీన్స్ పెంచడం, సింగిల్ విండో అనుమాతి, కార్మికులకు మరో తొమ్మిది ఎకరాల స్థలం ఇవ్వడానికి మంత్రుల కమిటీ సూత్రపాయంగా అంగీకరించింది. మరికొన్ని నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ తరుణంలో అకస్మాత్తుగా అల్లు అరవింద్ వైజాగ్ పల్లవి ఎత్తుకోవడం పట్ల తెరాస ప్రభుత్వం సీరియస్ గా ఉందనే మాట ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. అనేక రాయితీలు ఇవ్వడానికి సిద్దమైనప్పటికీ అరవింద్ తన వర్గాన్ని మెుత్తం వైజాగ్ వైపు చూసేలా చేస్తున్నారని, దీని వెనుక చంద్రబాబు మంత్రి వర్గంలోని కొందరు పావులు కదుపుతున్నారని అనుమానిస్తోంది. చిత్ర పరిశ్రమకు స్నేహ హస్తం అందిస్తున్నప్పటికీ తరలించడానికి అల్లు అరవింద్ వ్యూహాలు రచించడం పట్ల హైదరాబాద్ కు చెందిన కీలక మంత్రి ఆగ్రహించినట్టు సమాచారం. చిరంజీవికి తెలియకుండా అరవింద్ అడుగులు వేయరుకాబట్టి అందరికీ తెలిసే జరుగుతోందా అని అనుమానిస్తున్నారు. చిత్ర పరిశ్రమలో కాపు సామాజిక వర్గానికి చెందిన నిర్మాతలు తక్కువే. హీరోలు చిరంజీవి కుటుంబానికి చెందినవారే ఉన్నారు. వీరందరిని వైజాగ్ వైపు తరలించడానికి భవిష్యత్తులో అక్కడ పరిశ్రమ డెవలప్ చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు తెరాస ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రమాదం ఉంది. ఇది ప్రతిపక్షానికి ఆరోపణ అస్త్రం కూడా కావచ్చు. అందుకే తెరాస మంత్రులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారని తెలిసింది.