చిరంజీవి చిన్న కుమార్తె వివాహం అయిపోయింది. కాగా ఇప్పుడు మెగాస్టార్ భుజానికి మరో ఆపరేషన్ చేయించుకొని, ఏప్రిల్ రెండో వారం నుండి తన 150వ చిత్రం 'కత్తి' రీమేక్‌లో జాయిన్ కానున్నాడు. కాగా గతంలో చిరంజీవి నటించిన 'శంకర్‌దాదా ఎం.బి.బి.ఎస్, శంకర్ దాదా జిందాబాద్, అందరివాడు' వంటి చిత్రాలకు సంగీతం అందించిన సంగీత సంచలనం దేవిశ్రీనే ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. అదే సమయంలో నందమూరి బాలకృష్ణ నటించే 100వ చిత్రం ఓ హిస్టారికల్ మూవీగా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించనున్నాడు. కాగా ఈచిత్రాన్ని తానే సొంతగా నిర్మించాలని క్రిష్ భావిస్తున్నాడట. మరీ ఓవర్ బడ్జెట్‌తో కాకుండా 40, 45కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించాలనే ఆలోచనలో క్రిష్ ఉన్నట్లు సమాచారం. కాగా ఈచిత్రానికి కూడా దేవిశ్రీప్రసాదే సంగీతం అందించనున్నాడు. చారిత్రాత్మక చిత్రం కావడంతో మంచి రీరికార్డింగ్‌కు ప్రాధాన్యం ఉండే ఈ చిత్రానికి మొదట ఇళయరాజా, కీరవాణి, మణిశర్మ వంటివారి పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ చివరకు దేవిశ్రీకే ఆ బాధ్యతలు అప్పగించారని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఉగాదినాడు రానుంది. ఈ రెండు చిత్రాలతో దేవిశ్రీ పై చాలా బరువైన బాధ్యతలు పడ్డాయని ఇండస్ట్రీ లో వినిపిస్తుంది.