రాష్ట్ర స్థాయి లేదా ఫిల్మ్ ఫేర్ వంటి అవార్డు వస్తేనే సినీ కళాకారులు తబ్బుబ్బి అవుతారు. అలాంటిది ఏకంగా జాతీయ అవార్డు వస్తే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. కానీ అవార్డు గెలుచుకున్న తెలుగువారిలో అలాంటి స్పందన కనిపించడం లేదు. జాతీయ ఉత్తమ చిత్రంగా తొలిసారి తెలుగు సినిమా 'బాహుబలి'కి అవార్డు దక్కింది. ఇది ఆషామాషి విషయం కాదు. మీడియా మెుత్తం తెలుగు సినిమాకు దక్కిన గౌరవాన్ని ఘనంగా చాటి చెప్పింది. టీవీల్లో ప్రత్యేక కథనాలు వచ్చాయి. తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక తీర్మాణం చేసి అభినందించింది. బయట ఇంత స్పందన ఉంటే . అవార్డు గెలుచుకున్న 'బాహుబలి' యూనిట్ కు మాత్రం చీమకుట్టినట్టు అయినా లేదు. 'అవార్డు మా హక్కు' అనే విధంగా నిర్మాతలు, దర్శకుడు వ్యవహరించారు. ట్వీట్లతో సరిపెట్టారు. అదే బాలీవుడ్ లో చూస్తే అవార్డు గ్రహితలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అవార్డు గ్రహీతలు సహచరులతో తమ ఆనందాన్ని షేర్ చేసుకున్నారు. పండుగ వాతావరణం నెలకొంది. అదే 'బాహుబలి', 'కంచె' చిత్రాల విషయానికి వస్తే చడీచప్పుడు లేదు. యూనిట్ ను అభినందించే ప్రయత్నం కొందరు కళాకారులు చేసినా అటువైపు నుండి స్పందన లేదని, అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారనే విషయం కూడా తెలియదని వాపోతున్నారు. జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు దక్కిన గౌరవాన్ని ఆయా నిర్మాతలు గర్వంగా చెప్పుకోవాలి. కానీ జరుగుతున్నది వేరు.