జాతీయ చలన చిత్ర అవార్డులలో ఉత్తం చిత్రంగా 'బాహుబలి' ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే 'బాహుబలి' సినిమాకు జాతీయ స్థాయిలో అవార్డు రావడంపై సోషల్ మీడియాలో పలువురు కామెంట్ చేస్తున్నారు. సగం సినిమాకే ఉత్తమ జాతీయ చిత్రంగా అవార్డు ఎలా ఇస్తారని..? ప్రశ్నలు వేస్తున్నారు. మొదటి భాగానికి ఇచ్చినట్లుగానే రెండో పార్ట్ కు కూడా అవార్డు ఇస్తారా..? అని కౌంటర్లు వేసే వాళ్ళు ఉన్నారు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో.. కనీసం అవార్డు ఇచ్చిన జ్యూరీ మెంబర్స్ కు అయినా తెలుసా అంటూ జోక్స్ వేసుకుంటున్నారు. విజువల్ గా బాహుబలి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది కానీ.. అందులో సరైన కథ లేదన్నది కొందరి వాదన. భారీ బడ్జెట్ చిత్రాలు కేవలం బాలీవుడ్ లోనే తీయగలరని అనుకున్న వారికి తెలుగులో కూడా చేయగలరనే నమ్మకాన్ని కలిగించింది బాహుబలి చిత్రం. ఈ కష్టాన్ని గుర్తించిన జ్యూరీ సభ్యులు బాహుబలికి ఉత్తమ జాతీయ చిత్రంగా అవార్డు ఇచ్చి సత్కరించింది. తెలుగు సినిమాకు ఈ రేంజ్ లో అవార్డు రావడం గొప్ప విషయం. ఆ విషయాన్ని గుర్తించడం మానేసి అనవసరమైన కామెంట్స్ చేస్తున్నారని మరికొందరు భావిస్తున్నారు.